ఏపీ సీఎం చంద్రబాబుకు ఇంటా-బయటా కూడా.. ప్రధాన సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో టీడీపీలో పనిచేసి.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఒకరిద్దరు సీనియర్ నాయకులు రాజధాని అమరావతికివ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమమే లేవదీ స్తున్నారు. వయసు రీత్యా వృద్ధులే అయినా.. మాటల పరంగా వారు చేస్తున్న ప్రచారం.. అమరావతికి శరాఘాతంగా మారు తోంది. ఉదాహరణకు మాజీ మంత్రి, టీడీపీ మాజీ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు.. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా గత నెల రోజులుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా శనివారం కూడా ఆయన అమరావతిలోనే ప్రసంగాలతో దంచికొట్టారు.
ఇప్పటికే 33 వేల ఎకరాలను సేకరించారని.. ఇప్పుడు మరో 44 వేల ఎకరాలను తీసుకుంటున్నారని.. దీనివల్ల.. ప్రయోజనం లేదని.. వడ్డే చెబుతున్నారు.రాజధానికి భూములు ఇవ్వొద్దని.. ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. వ్యవసాయ సంఘాలను కూడా ఏకం చేసి రైతుల మైండ్ సెట్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మరోవైపు ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి చంద్రబాబు చెక్ పెడుతున్నా.. ఇలా.. గతంలో తన దగ్గరే మంత్రులుగా చక్రాలు తిప్పిన వారు చేస్తున్న యాంటీ ప్రచారాన్ని చంద్రబాబు అడ్డుకోలేక పోతున్నారు.
ఇక, మరో కీలక విషయం.. పోలవరం, బనకచర్ల. ఈ రెండు ప్రాజెక్టులను కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే 2027 నాటికి పోలవరం, 2028 నాటికి బనకచర్ల పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం అంటే అందరికీ తెలిసిందే. ఇప్పటికే నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. ఇక, కొత్త ప్రాజెక్టు బనకచర్ల. దీనికి డీపీఆర్ మాత్రమే ఇప్పటి వర కు రెడీ అయింది. దీనికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇది సాగుతున్న క్రమంలోనే తెలంగాణ నుంచి తీవ్రమైన ఒత్తిడి పడుతోంది.
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అంతేకాదు.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు.. గత వారం రోజులుగా బనకచర్ల ప్రాజెక్టును టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంలోకి బీజేపీని, కాంగ్రెస్‌ను కూడా చాలా లౌక్యంగా తీసుకువస్తున్నారు. ఈ పరిణామాలు తీవ్ర రూపం దాల్చితే.. బనకచర్లపై కేంద్రం యూటర్న్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది.
అంతేకాదు.. బీజేపీకి ఏపీ మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయ పరిణామాలు కూడా కీలకమైన నేపథ్యంలో ఈ ప్రబావం కూడా చంద్రబాబుపై పడనుందని అంటున్నారు. సో.. అటు అమరావతి, ఇటు పోలవరం, బనకచర్ల విషయాల్లో చంద్రబాబుకు ఇంటా -బయటా కూడా.. సెగ తగులుతుండడం గమనార్హం.