టీడీపీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి గతంలో ఎప్పుడూ ఇవ్వని వార్నింగ్ ఇచ్చారు. బహుశ ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ కూడా ఇలా ఇంత సీరియస్ అయి ఉండరు. కానీ.. ఇప్పుడు సమయం వచ్చిందని భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే.. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పిన బాబు.. దీనిని కట్టు తప్పిన వారు ఎంతటి వారైనా పార్టీ నుంచి బయటకు గెంటేస్తామని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
పార్టీలో ప్రతి ఒక్కరినీ ఓ కంట కనిపెడుతున్నట్టు చంద్రబాబు చెప్పారు. పార్టీకి.. అదేసమయంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే నాయకులను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదన్నారు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించినట్టే.. పని చేయని వారిని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన వారిని… కోవర్టులుగా వ్యవహరించిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ పార్టీలో కొనసాగనిచ్చే అవకాశం లేదన్నారు. వారు ఎంతటి వారైనా ఫర్వాలేదన్నారు. పార్టీలో నాయకులను తయారు చేసుకుంటామని.. కానీ, ఉన్న నాయకులు దారి తప్పితే.. ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు.
ఇక, పార్టీ నాయకులు తినితొంగుంటామంటే కుదరదని కూడా చంద్రబాబు చెప్పారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. వీటిని ప్రజలకు వివరించే బాధ్యత పెద్ద పార్టీగా టీడీపీపైనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు.. ప్రజల్లోకి వెళ్లి.. ప్రభుత్వం చేసిన మంచిని.. సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించాలని సూచించారు. పనిచేసే వారికి తగిన విధంగా గుర్తింపు ఉంటుందన్నారు. నాయకులు, కార్యకర్తల పనితీరుపై సర్వే చేయిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. వాటి ఆధారంగానే పదవులు ఇవ్వనున్నట్టు చెప్పారు.
జగన్ అసమర్థుడు
జగన్ ఓ అసమర్ధుడని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆయన పాలన కారణంగా పెట్టుబడులు పెట్టేవారు కూడా రాష్ట్రానికి రాలేదని చెప్పారు. వైసీపీ హయాంలో ప్రజలు నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయారని చెప్పారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై అనేక బాధ్యతలు పడ్డాయని.. వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలిపారు.