రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటే అంత గుర్తింపు నిజమే! కానీ, ఇది అందరికీ వర్తించే సూత్రం అవుతుందా? అందరి విషయంలోనూ దూకుడు మంచిదేనా? అంటే.. వైసీపీ నాయకుడు,మంత్రి కురసాల కన్నబాబు విషయంలో మాత్రం కాదనే అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా కాకినాడలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం. గత కొన్నాళ్లుగా.. మంత్రికి ఇక్కడ సహాయ నిరాకరణ ఎదురవుతోందనే వార్తలు వస్తున్నాయి. స్థానిక అధికారులు కూడా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తూ వ్యవసాయ మంత్రి, పైగా జగన్‌కు సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న కన్నబాబు విషయంలో ఇలా ఎందుకు జరుగుతోంది? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.
దీనికి పరిశీలకులు చెబుతున్న సమాధానం.. మంత్రిగారి దూకుడే ఆయన కొంప ముంచుతోందని! గత ఏడాది ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీలోకి వచ్చిన కన్నబాబుకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఆయన తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. ప్రతిపక్షంపైనా.. ఇతర నాయకులపైనా ఆయన దూకుడు చూపారు. నిత్యం మీడియాలో విమర్శల జోరు పెంచారు. నిజానికి ఈ పరిస్థితిలో నాయకుడు వెలిగిపోవాలి. కానీ, కన్నబాబుకు ఇదే రివర్స్ అయింది. దీనికి కారణం.. కాకినాడలో ఆది నుంచి వైసీపీలో ఉన్న నాయకులు. తమకు లేని గుర్తింపు కన్నబాబుకు లభిస్తుందేమోననే బెంగ!
నిజమే.. కాకినాడకు చెందిన చాలా మంది నాయకులు.. ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో ఆది నుంచి ఉన్నారు. పైగా జగన్‌తో వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. వీరిలో చాలా మందికి గుర్తింపు లభించలేదు. వీరి తర్వాత పార్టీలోకి వచ్చిన కన్నబాబుకు మాత్రం జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, వీరంతా ఏదైనా ఉంటే జగన్‌పై చూపించాలి కానీ, కన్నబాబుపై ఏడు పెందుకు? అనే ప్రశ్న సాధారణమే. కానీ, ఇలా ఆలోచిస్తే.. రాజకీయాలు ఎందుకవుతాయి. అందుకే.. కన్నబాబుకే ఎసరు పెట్టి ఆత్మపరిశీలనలో పడేస్తే.. సరిపోతుందని భావించారు.
వీరి వ్యూహానికి అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సహకరిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యమే! దీంతో కన్నబాబుకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆయన చెప్పిన మాట అధికారులు వింటున్నా.. కార్యాచరణలో మాత్రం చూపించడం లేదు. మొత్తానికి ఈ విషయం ఇప్పటికే నియోజకవర్గం పరిధి దాటి.. జిల్లాల సరిహద్దులు దాటి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. మున్ముందు ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. దీనికి పరిష్కారం ఎలా ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాలి!