నేడే కేబినెట్ విస్తరణ… ఆ ముగ్గురు ఎవరంటే?

అదుగో, ఇదుగో అంటూ దాదాపుగా అరు నెలల నుంచి ఊరిస్తూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య రాజ్ భవన్ లో జరగనున్న కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో పార్టీపై గట్టి పట్టున్న జి.వివేక్ (మాల)తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (మాదిగ), వి.శ్రీహరి ముదిరాజ్ (బీసీ)లు ఉన్నారు.

వాస్తవానికి కేబినెట్ మొత్తంగా ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఓ నాలుగు పదవులను భర్తీ చేసి మిగిలిన రెండింటినీ అలాగే ఖాళీగా ఉంచేయాలని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ నాలుగు కాకుండా ఇప్పుడు అందులో మరో స్థానాన్ని కూడా ఖాళీగా ఉంచేసి కేవలం మూడు స్థానాలనే భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతి ఇచ్చింది. అధిష్టానం ఇచ్చిన అనుమతిని సీఎం రేవంత్ రెడ్డి ఆయా వర్గాలకు చెందిన నేతలకు తెలియజేసి… వారిని ఒప్పంచి మరీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆయా వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లను ఓపిగ్గా వింటూనే రేవంత్ పరిస్థితిని చక్కదిద్దారు. 

ఇదిలా ఉంటే… రేవంత్ రెడ్డి కేబినెట్ కు ఓ అరుదైన గుర్తింపు దక్కనుంది. ఇప్పటిదాకా ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కిన దాఖలానే లేదని చెప్పాలి. ఆ సామాజిక వర్గం నుంచి చాలా మంది బలమైన నేతలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు బీసీల్లోని వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడులు, ఈక్వేషన్ల కారణంగా ఇప్పటిదాకా ముదిరాజ్ లకు కేబినెట్ స్థానమే దక్కలేదు. అయితే ఇప్పుడు శ్రీహరి ముదిరాజ్ కు కేబినెట్ లో చోటు ఇవ్వడం ద్వారా… ముదిరాజ్ లకు కేబినెట్ లో స్థానం కల్పించిన తొలి సీఎంగా రేవంత్ కు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది.

ఇక కేబినెట్ లో తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం దక్కి తీరుతుందని బలంగా నమ్మిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలకు ఈ దఫా నిరాశే ఎదురైంది. ఇప్పటికే కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గానికి అనుకున్న దానికంటే కూడా అధిక ప్రాధాన్యమే లభించిందన్న వాదనతో అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. దీంతో కోమటిరెడ్డి, సుదర్శన్ రెడ్డిల పేర్లను పక్కనపెట్టేసింది. అదే సమయంలో తమ ఇంటిలో ఇద్దరు ఎమ్మెల్యే, ఓ ఎంపీ ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం వద్ద మంచి రాపో కొనసాగిస్తున్న వివేక్… తన పట్టును నిలుపుకున్నారు. ఎన్ని ఈక్వేషన్లు మారినా తనకు మాత్రం మంత్రి పదవిని ఆయన దక్కించుకున్నారు.