=

`సంతృప్తి`.. మ‌ళ్లీ పెరిగింది.. ఈసారి ఎంతంటే.. !

చంద్ర‌బాబు పాల‌న‌లో సంతృప్తి కొల‌మానాలు స‌హ‌జం. ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌భుత్వం అందిస్తున్న పాల‌న పై ఆయ‌న లెక్క‌లు వేసుకుని గ‌ణాంకాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం రివాజు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 11 మాసాల్లో 10కి పైగా స‌ర్వేలు చేయించారు. వీటిలో ఆయా ప‌థ‌కాలు.. ప్ర‌భుత్వ పాల‌న‌, ఎమ్మెల్యేల ప‌నితీరు, మంత్రుల రికార్డు, సీఎంగా చంద్ర‌బాబు ప‌నితీరు.. ఇలా అనేకం ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎక్క‌డా లేని విధంగా మ‌ద్యంపైనా స‌ర్వే చేయించారు.

తాజాగా రెండు అంశాల‌పై ప్ర‌భుత్వం మ‌రో స‌ర్వే నిర్వ‌హించింది. అది.. 1) రేష‌న్ దుకాణాలు. 2) స‌చివాలయ వ్య‌వ‌స్థ‌. ఈ రెండు కూడా.. కీల‌క‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న విష‌యం తెలిసిందే. పైగా.. ఈ రెండు కూడా.. మార్పులు జ‌రిగాయి. గ‌త వైసీపీ హ‌యాంలో రేష‌న్ బ‌ళ్లు ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చేవి. అయితే.. ఈ వాహ‌నాల ద్వారా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, పైగా 1200 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఏటా ఖ‌ర్చ‌వుతోందని ప్ర‌భుత్వం లెక్క‌లు వేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే వాటిని తీసేసింది.

ఇక‌, గ‌త పాత విధానం అయిన రేష‌న్ దుకాణాల‌ను తిరిగి తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ నెల 1వ తేదీ నుంచి కూడా.. రేష‌న్ దుకాణాల ద్వారానే రేష‌న్ పంపిణీ జ‌రుగుతోంది. వృద్ధులు, విక‌లాంగులు ల‌బ్దిదారులుగా ఉంటే వారికి మాత్రం ఇంటి వ‌ద్ద‌కు రేష‌న్ పంపించే బాధ్య‌త‌ను రేష‌న్ దుకాణ దారుల‌కే అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 5న ఒక్క‌రోజులోనే ప్ర‌బుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ ఎస్ ద్వారా స‌ర్వే చేప‌ట్టింది. రేష‌న్ దుకాణాల‌ను కొన‌సాగించ‌డం బాగుందా? అనే దానిపై అభిప్రాయాలు తీసుకుంది.

దీనికి మెజారిటీ ల‌బ్దిదారులు బాగుంద‌ని స‌మాధానం చెప్పార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గ‌తంలో బ‌ళ్లు ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చేవి కాద‌ని.. పైగా అవి ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌క త‌మ ప‌నులు మానుకోవాల్సి వ‌చ్చేద‌ని కూడా ల‌బ్ధిదారులు వివ‌రించారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం చేసిన మార్పును 99 శాతం మంది అంగీక‌రించార‌ని స‌ర్వే చెప్పింది. ఇక‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఉన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. గ‌తంలో ఉన్న కార్యాల‌యాలే బాగున్నాయ‌ని మ‌రో స‌ర్వేలో ప్ర‌జ‌లు తేల్చిచెప్పారు. దీంతో ప్ర‌భుత్వం ప‌నితీరుకు 90 శాతం మేర‌కు ఆమోదం ల‌భించిన‌ట్టు అయింద‌ని స‌ర్కారు చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌త స‌ర్వేలో 85 శాతం ఉన్న సంతృప్తి ఇప్పుడు 90కి చేరింద‌ని పేర్కొంది.