తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఇటీవల ముగిసిన ఉప ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదు. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితంలో మాత్రం బీజేపీకి అవకాశం ఉందనే సంకేతాలు వచ్చాయి. మరికొన్ని సంస్థలు టీఆర్ఎస్ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అంటున్నాయి. ఒకవేళ.. మొదటి అంచనానే నిజమైతే.. అంటే.. దుబ్బాకలో బీజేపీనే గెలుపు గుర్రం ఎక్కితే.. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దూకుడుకు బ్రేకులు పడతాయనే వ్యాఖ్యలు ఓ వర్గం నేతల్లో వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు వాస్తవం. ఒక నియోజకవర్గంలో వచ్చే ఫలితం ప్రభుత్వ పార్టీని అంతగా ప్రభావితం చేస్తుందా? అదేసమయంలో అస్తిత్వ పోరులో ఉన్న బీజేపీకి జవసత్వాలు ఇస్తాయా? అనేవి తెరమీదకు వచ్చిన ప్రశ్నలు.
వీటిని ఎందుకు చర్చించాల్సి వస్తోందంటే.. తెలంగాణ వాదాన్ని.. ఆది నుంచి భుజాలపై మోశానని.. తెలంగాణ జాతి పితగా.. పరోక్షంగా తనను ఆవిష్కరించుకునే కేసీఆర్ హవా .. ఒక్క నియోజకవర్గంపై ఆధారపడి ఉంటుందనే చర్చ సాగుతున్నదనే! దుబ్బాకలో విజయం ఏకపక్షమని, అది టీఆర్ఎస్‌కు మాత్రమే సాధ్యమని ఆది నుంచి టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఈ నియోజకవర్గాన్ని కీలకంగా తీసుకుని ప్రచారం చేశారు. రేపు ఓడిపోతే.. వీరి హవా తగ్గిందనే భావించాల్సి వస్తుందా? అంటే.. కానేకాదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గెలుపు ఓటములు ఎలా ఈసారికి తడబడినా.. అంతిమంగా 2023లో జరిగే ఎన్నికల్లో మాత్రం దీని ప్రభావం ఉండదని అంటున్నారు.
కేసీఆర్ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ప్రజలను ఆయన ఆకర్షించినట్టుగా మరెవరూ ఆకర్షించే ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదు. స్థానిక వాదాన్ని రెచ్చగొట్టినా.. ప్రజలను తనవైపు తిప్పుకొనే వ్యూహాలు రచించినా ఆయనకు ఆయనే సాటి. రేపు ఒకవేళ దుబ్బాకలో ఓడిపోతే.. తన వ్యూహాలను సమీక్షించుకుని మరింత బలం పుంజుకునేందుకు అవకాశం ఉంటుందే.. తప్ప ఇదే ఆఖరు కాదని విశ్లేషకుల అభిప్రాయం. అదేసమయంలో బీజేపీ విషయాన్ని చూస్తే.. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో బీజేపీ పుంజుకున్నది చాలా చాలా తక్కువ.
2018లో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకున్న పార్టీ.. దుబ్బాక విజయంతో రాష్ట్రమంతా తమవైపే చూస్తోందని చెప్పుకొన్నా.. అది అతిశయోక్తే అవుతుంది తప్ప.. వాస్తవం కానేరదు. టీఆర్ఎస్ మాదిరిగా పుంజుకునేందుకు బీజేపీకి చాలా వ్యూహంతోపాటు సమయం కూడా అవసరం. పైగా.. కేసీఆర్ స్థాయిలో తెలంగాణ ప్రజలను ఆకర్షించే నాయకుడు బీజేపీ లో లేకపోవడం మరింత మైనస్. కాబట్టి దుబ్బాక విజయం టీఆర్ఎస్‌పై ప్రబావం చూపించే అవకాశం కానీ.. కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తుందనే అంచనా కానీ.. ఒట్టిదేనని తేల్చేస్తున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates