ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు గురువారం రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో కోటి మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించగా… పవన్ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా చెట్లను నాటి బాబు, పవన్ లు ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఈ సందర్బంగా వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగిందన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ జమానాలో జగన్ హెలికాప్టర్ లో వెళుతున్నా…కింద ఉన్న చెట్లను నరికించేశారని చంద్రబాబు సెటైర్లు సంధించారు. చెట్లను నరికివేయడాన్ని దుర్మార్గం అనక మరేమంటామని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కూటమి సర్కారులో ఏం జరుగుతుందన్న దానినీ వివరించిన ఆయన కూటమి పాలనలో చెట్లను నాటుతున్నామని తెలిపారు. చెట్టను నాటడమంటే బాధ్యత అని.. ఆ బాధ్యతను కూటమి తీసుకుందని ఆయన చెప్పారు. వైసీపీ సర్కారుది దుర్మార్గమైతే… కూటమి సర్కారుది బాధ్యత అని ఆయన వెల్లడించారు.
కూటమి పాలనలో సీఎం హోదాలో తాను వస్తున్నా, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ వస్తున్నా… ఎక్కడైనా ఒక్క చెట్టు అయినా నరికివేతకు గురవుతోందా? అని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. చెట్లను నాటితే సమాజానికి, పర్యావరణానికి మంచి జరుగుతుంది గానీ… అదే చెట్లను నరికివేస్తే సమాజంతో పాటు, పర్యావరణానికి కూడా తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. రానున్న నాలుగేళ్లలోనే రాష్ట్రంలో 37 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రజలందరి సహకారం అవసరమని బాబు కోరారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా కోటి మొక్కలను నాటే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ధ్వేయంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ పర్యావరణవేత్త కుమెర అంకారావు సేవలను పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 14 ఏళ్ల వయసులోనే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగే నష్టంపై అవగాహన పెంచుకుని పర్యావరణ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలకు పైగా అవిశ్రాంత కృషి చేస్తున్నారని ఆయన అంకారావును కీర్తించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ అంకారావును ఆదర్శంగా తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.