ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, గత 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన.. ఆలూరి బాల వెంకటేశ్వరరావు(ఏబీవీ) తాజాగా న్యాయశాస్త్ర పరీక్షకు హాజరయ్యారు. ఏపీలో లాసెట్ ఎంట్రన్స్ టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ పరీక్షకు ఆయన రావడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్ ఎంట్రన్స్‌ను గురువారం నిర్వహించారు. లా చదివేందుకు వయో పరిమితి నిబంధనలు లేకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఏబీవీ ఈ పరీక్షకు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇనిస్టిట్యూట్ కేంద్రంలో నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఆయన హాజరై సాధారణ విద్యార్థులతో సమానంగా తన సీటులోకి వెళ్లి కూర్చున్నారు. ఈ పరీక్ష రెండు విడతలుగా జరగనుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలోనూ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. అయితే..ఏబీవీ ఇప్పటికే ఐపీఎస్‌గా అనేక జిల్లాల్లో పనిచేయడం.. కీలకమైన ఇంటెలిజెన్స్‌లో చీఫ్‌గా వ్యవహరించడం తెలిసిందే.
అయినా.. ఆయన న్యాయ శాస్త్రం ఎందుకు చదువుతున్నట్టు? అనేది ఆశ్చర్యంగా అనిపించడం ఖాయం. అయితే.. ఏబీవీ ఐపీఎస్‌గా రిటైరైన తర్వాత.. కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. జగన్‌పై పోరాటం చేస్తానని.. ఆయన అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తానని తూర్పుగోదావరి జిల్లాలో గత నెలలో పర్యటించిన సమయంలో శపథం చేశారు. అయితే.. ఇలా జగన్‌పై పోరాటం చేసేందుకు.. ఆయనకు న్యాయపరమైన సబ్జెక్టులో మరింత దన్ను కావాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఏబీవీ నేరుగా న్యాయ శాస్త్రాన్ని అభ్యసించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వాస్తవానికి ఏబీవీ.. రాజకీయాల్లోకి వస్తున్నట్టు కూడా ప్రకటించారు. అదికూడా రాజకీయాల్లోకి జగన్ కోసమే వస్తున్నట్టు ఆయన ప్రకటించారు కానీ, రాజకీయంగా కంటే కూడా.. జగన్‌ను ఎదిరించేందుకు న్యాయశాస్త్రం అభ్యసించడమే కరెక్ట్ అనే భావనకు వచ్చి ఉంటారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం ఎంట్రన్స్‌లో ఆయన విజయం దక్కించుకుని కోర్సు ప్రారంభిస్తే.. 2028 నాటికి మూడేళ్ల లా కోర్సును పూర్తి చేయొచ్చు. ఆ తర్వాత.. పీజీ కోర్సు కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే.. వచ్చే ఎన్నికల నాటికి ఏబీవీ లాయర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates