ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే కాకుండా.. ఆ పార్టీని కేవలం 11 సీట్లకు పరిమితం చేస్తూ.. ప్రజలు ఇచ్చిన తీర్పునకు నేటితో(జూన్ 4, 2025) ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కూటమి పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక, తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రి వర్గం కూడా భేటీ అయింది. వివిధ అంశాలపై చర్చ కోసం నిర్వహించిన ఈ సమావేశంలో తొలి చర్చగా గత ఏడాది ఇదే రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలపై మంత్రులు చర్చించారు.
ఈ సందర్భంగా `ప్రజా తీర్పునకు ఏడాది` పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చర్చను ప్రారంభించారు. ఏడాది కిందట ఇదే రోజు రాష్ట్రంలో కొత్త చరిత్ర ప్రారంభమైందన్నారు. దీనికి కారణం.. చంద్రబాబేనని ఆయన పేర్కొన్నారు. అకుంఠిత దీక్షతో రాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ.. ప్రజల కోసం నిద్రాహారాలు మాని మరీ.. నిర్వహించిన యాత్రల ఫలితంగాను రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని పేర్కొన్నారు. ఇదేసమయంలో కూటమి పార్టీల నాయకులు సహకరించారని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబును మంత్రి వర్గంలోని సభ్యులు అభినందించారు. చంద్రబాబు వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా మంత్రి వర్గ సభ్యులు గుర్తు చేశారు. గత ఏడాది వచ్చిన అద్భుతమైన ఫలితం.. ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్, ప్రధాని మోడీ సహా.. బీజేపీ నాయకులకు అభినందనలు తెలిపారు.
కలసి కట్టుగా ఉంటే.. విజయం దక్కించుకోవడం ఎంత సులభమో గత ఏడాది ఇదే రోజు తెలిసిందన్నారు. భవిష్యత్తులోనూ కూటమి పదిలంగా ఉంటుందని, ప్రజలకు మేలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మరికొందరు మంత్రులు నారా లోకేష్ చేసిన పాదయాత్రను ప్రస్తావిస్తూ.. విజయానికి అది కూడా దోహదపడిందని పేర్కొని ఆయనను కొనియాడారు.