ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అత్యంత కీలకమైన పథకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సీఎం చంద్రబాబు డెడ్ లైన్ ను ప్రకటించగా… తాజాగా బుధవారం ఆయన నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ పథకానికి అవసరమైన నిధుల విడుదలకూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంటే.. ఇక ఈ పథకం అమలుకు తేదీ ప్రకటనే తరువాయి అని చెప్పొచ్చు.
2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగానే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం నిధులు వేస్తామని ఇదివరకే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో వేసవి సెలవుల తర్వాత ఈ నెల 12న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అంటే… ఈ నెల 12లోగానే తల్లికి వందనం పథకం అమలు జరిగి తీరుతుందని చెప్పక తప్పదు. ఈ పథకం కింద పాఠశాల స్థాయిలో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఇంటిలో ఎంతమంది పిల్లలు ఈ పథకానికి అర్హత కలిగి ఉంటే… అంతమందికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మొన్నటి రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తల్లికి వందనం పథకం కోసం కొంత మేర నిధులను కేటాయించారు. ఈ నిధులకు అదనంగా నిధులు అవసరమైతే కూడా సర్దుబాటు చేసేందుకు కూటమి సర్కారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్నింటినీ పరిశీలించిన తర్వాతే బుధవారం నాటి కేబినెట్ సమావేశంలో తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం లభించిందంటే.. ఆ పథకం అమలు అయిపోయినట్టేనని చెప్పాలి. ఈ క్రమంలో ఈ పథకం అమలుకు తేదీ ప్రకటనే తరువాయిగా మారిందని చెప్పాలి.
ఇదిలా ఉంటే… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులంతా పాలుపంచుకున్న ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అందులో భాగంగా రాజధాని అమరావతిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే సీఆర్డీఏ ప్రతిపాదించిన అన్ని రకాల పనులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా అమరావతి పనుల్లో మరింత వేగం కనిపించనుంది. కొత్త పనులపైనా సీఆర్డీఏ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఓ వైపు సంక్షేమం, మరోవైపు రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు తనదైన శైలి దూకుడును ప్రదర్శిస్తున్నారని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates