“యువగళం పాదయాత్ర భేష్. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు చేపట్టిన ఈ పాద యాత్ర సఫలీకృతమైంది.“ అని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నాడు 2023-24 మధ్య టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రను ఆయన అభినందించారు. తాజాగా నారా లోకేష్ తన పాదయాత్రపై పుస్తకం రూపొందించిన విషయం తెలిసిందే. అనేక విషయాలు.. ఫొటోలతో రూపొందించిన ఈ యువగళం పాదయాత్ర పుస్తకాన్ని తాజాగా పవన్ కల్యాణ్‌కు అందించా రు.
బుధవారం ఉదయం 12 గంటలకు సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ వచ్చారు. ఈ సమయంలో ఆయనను కలుసుకున్న మంత్రి నారా లోకేష్ .. ఇతర మంత్రుల సమక్షంలో పవన్ కల్యాణ్‌కు యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందించారు. దీనిని ఆసాంతం పరిశీలించిన పవన్ కల్యాణ్.. నాటి పాదయాత్ర విశేషాలను సమగ్రంగా వివరించారంటూ.. లోకేష్‌ను అభినందించారు.
అంతేకాదు.. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి.. ఏడాది అయిందని.. దీనికి యువగళం పాదయాత్ర కూడా.. చాలా కలిసి వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరినీ పాదయాత్ర కదిలించిందని.. సుదీర్ఘ ప్రస్థానం పాదయాత్ర సాగడం విశేషమేనని చెప్పారు. మనస్పూర్తిగా నారా లోకేష్‌ను అభినందిస్తున్నానని.. పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను కూడా పాదయాత్ర ప్రస్తావించిందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో మార్పునకు యువగళం నాంది పలికిందన్నారు.