ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిందే-ఇదీ కొన్నాళ్లుగా వైసీపీ నేతల్లో వినిపిస్తున్న మాట. దీనికి కారణం.. ఆయన రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిలో ఉండి కూడా రాజకీయాల ను మాట్లాడలేకుండా ఉండడమే! గతంలోనూ చంద్రబాబు హయాంలో మంత్రి పదవిని అలంకరించిన ఆయన.. గత ఏడాది ఎన్నికల్లో చాలా ఏళ్ల విరామం తర్వాత నెగ్గిన నేపథ్యంలో బీసీ కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, జగన్ ఆయనకు స్పీకర్ పదవిని కట్టబెట్టారు. సీనియర్ నాయకుడు.. టీడీపీ మూలాలు తెలిసిన నేత.. కావడంతో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు కూడా కావడంతో ఆయనకు స్పీకర్ స్థానాన్ని అప్పగించారు.
అయితే, తాను కోరుకుంది ఒకటి.. దక్కింది మరొకటి కావడంతో తమ్మినేనిలో అప్పుడప్పుడు .. అసహనం పెల్లుబుకుతూనే ఉంది. గతంలో చంద్రబాబు.. తనను కాదని.. తనకు పోటీగా తన మేనల్లుడు(కూన రవి)ని ప్రోత్సహించడంపై ఇప్పటికీ తమ్మినేనిలో ఆగ్రహం ఉంది. దీంతో మంత్రి పదవి ఇస్తే.. భారీ ఎత్తున టీడీపీని ఇరుకున పెట్టేవాడినని ఆయన భావన. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్నప్పటికీ.. ఆయన తరచుగా.. టీడీపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో అయినా.. తనకు మంత్రి పీఠం దక్కుతుందనేది ఆయన ఆలోచనగా ఉందని శ్రీకాకుళం వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఓకే! ఇంత వరకు బాగానే ఉంది. జగన్ కూడా ఇలాంటి నాయకులనే కోరుకుంటున్నారు కాబట్టి.. మంత్రి పదవి ఇవ్వడాన్ని వైసీపీ నాయకులు కూడా సమర్థిస్తున్నారు. కానీ.. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రెండోవారు ఇటీవలే.. మంత్రి పదవిని చేపట్టిన పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు. వీరిద్దరూ కూడా జగన్ కు అత్యంత సన్నిహితులు. పైగా ఏరికోరి.. ధర్మానను డిప్యూటీ సీఎంను చేశారు. సో.. ఆయనను అతి తక్కువ సమయంలోనే అంటే.. వచ్చే ఏడాది పునర్వ్యస్థీకరణలోనే పక్కన పెట్టే సంకేతాలు కనిపించడం లేదు.
అలాగని.. నిన్న గాక మొన్న మంత్రి పదవిని చేపట్టిన.. సీదిరి అప్పలరాజును పక్కన పెడతారా? అంటే.. అది కూడా సాధ్యం కాదనే భావన పార్టీలో వినిపిస్తోంది. పోనీ.. ఈ రెండు మార్గాలను వదిలేసి.. ఒకే జిల్లా నుంచి ముగ్గురిని మంత్రులుగా తీసుకుంటారా? అంటే అది జరిగే పనికాదని అంటున్నారు. ఈ క్రమంలో ఎవరు బలవుతారు? అనే ప్రశ్న శ్రీకాకుళం పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ నడుస్తోంది. తమ్మినేనికి మంత్రిపదవి ఇవ్వడం ఖాయమనే వాదన ఎంత నిజమో.. ఎవరు బలవుతారో? అనేది అంతే సందేహంగా ఉండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates