ఆంధ్రప్రదేశ్‌లో ఓ విషాదాంతం అందరినీ కలచి వేస్తోంది. ఒక సీఐ వేధింపులు తాళలేక ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం, చనిపోవడానికి ముందు తమ దీన స్థితిని తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేయడం, ఆ వ్యక్తి మైనారిటీ కావడంతో సంబంధిత కేసు చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఇటీవల కౌలూరు ప్రాంతంలో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అబ్దుల్‌తో పాటు అతడి భార్య, కొడుకు, కూతురు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఐతే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డ కొన్ని రోజుల తర్వాత వీరి సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది.
ఏడాది క్రితం బంగారం చోరీ కేసులో పోలీసులు అబ్దుల్‌ను నిందితుడిగా చేర్చారు. ఐతే తాను దొంగతనం చేయకున్నా నేరం ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి పెంచుతున్నారని.. అది భరించలేకే కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకుంటున్నానని అబ్దుల్ అందులో ఏడుస్తూ చెప్పాడు. తమ ఆత్మహత్యకు నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లే కారణమని అబ్దుల్ ఆరోపించాడు.
ఈ వీడియో బయటికి రాగానే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సీఐను సస్పెండ్ చేయడమే కాక. ఆయన్ని, కానిస్టేబుల్ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు మైనారిటీ కావడంతో ఈ కేసుపై స్వయంగా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ఐజీ శంకబత్ర బాగ్చి నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు. సీఐపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీఐజీ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates