వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టుండి సడెన్ గా గుంటూరు జిల్లా తెనాలి పర్యటనను ప్రకటించారు. మంగళవారం నాటి జగన్ పర్యటనకు సంబంధించిన నిర్ణయాన్ని వైసీపీ సోమవారం ఉదయం ప్రకటించింది. ఇటీవలే బహిరంగంగా ముగ్గురు యువకులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జాన్ విక్టర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారట. ప్రస్తుతం అతడిని పరామర్శించేందుకు జగన్ తెనాలి పర్యటనకు వెళుతున్నారు. జాన్ విక్టర్ ను పరామర్శించిన వెంటనే జగన్ తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్న ముగ్గురు యువకులపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. అంతేకాకుండా ఓ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కారణంగానే వారిని పోలీసులు బహిరంగంగా శిక్షించినట్లు సమాచారం. అయినా ఈ ఘటన నిన్నో, మొన్నో జరగలేదు. ఈ ఘటన జరిగి దాదాపుగా వారం దాటిపోతోంది. అప్పుడు జరిగిన ఘటనపై ఇప్పుడు స్పందించిన జగన్… జాన్ విక్టర్ పరామర్శకు బయలుదేరుతుండటం గమనార్హం.
జగన్ తెనాలి పర్యటన గురించి ప్రకటన వచ్చినంతనే కూటమి ప్రభుత్వం భగ్గుమన్నది. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… జగన్ తీరుపై ఓ రేంజిలో ఫైరయ్యారు. పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నవారేమీ సజ్జనులు కాదు… వారంతా గంజాయి బ్యాచ్ లకు చెందిన నేరస్తులు.. వారిపై ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. అలాంటి వారిని పరామర్శించి జగన్ జనానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటూ అనిత తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పోలీసులపై దాడికి దిగిన నేరస్తులను శిక్షించక ముద్దు పెట్టుకుంటారా? అని కూడా ఆమె జగన్ ను ప్రశ్నించారు.
ఓ వైపు జగన్ తన తెనాలి పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే… జగన్ పర్యటనను నిర్వీర్యం చేసే దిశగా కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నేరస్తులను పరామర్వించే రాజకీయ నేత స్వభావం కూడా నేరపూరితమే కదా అంటూ కూటమి ప్రచారం మొదలుపెట్టింది. గతంలో అనంతపురంలో తమ పార్టీ కార్యకర్తల పరామర్శకు వెళితే…తమపై కేసులు పెట్టారని అనిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన నేరస్తుడిగా ముద్రపడిన జాన్ విక్టర్ ను పరామర్శిస్తే.. జగన్ పై కేసు నమోదు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ తెనాలి పర్యటనకు రచ్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates