ఏపీలో కీలకమైన ఓటు బ్యాంకు సంతృప్తితోనే ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఏపీలో ప్రభుత్వాన్ని మార్చగల శక్తిగా కొన్ని వర్గాలను రాజకీయ నాయకులు పేర్కొంటారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు.. యువత.. గ్రామీణులు కీలకం. మధ్యతరగతి వారు ఉన్నా.. వారు పోలింగ్ బూత్ వరకు వస్తారో రారో.. అనేది చెప్పడం కష్టం. సో.. వారిని దాదాపు ఎలిమినేట్ చేస్తారు. దీంతో సాధారణంగా మహిళలను, ఉద్యోగులను, యువతను, గ్రామీణులను మాత్రమే ఓటు బ్యాంకు లెక్కల్లో చేర్చుకుంటారు.
ఈ పరంగా చూసుకుంటే.. ఉద్యోగులు సంతోషంగా ఉన్నారన్నది తెలిసింది. ఉద్యోగ సంఘాలు నాయకులు కూడా ఇటీవల సర్కారుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమకు 1వ తేదీనే జీతాలు అందుతున్నాయని చెబుతున్నారు. వైసీపీ హయాంలో నెల నెలా జీతాలు అందినా.. ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టంగా మారిందని అంటున్నారు. అయితే.. ఇప్పుడు 1వ తేదీ కల్లా తమకు వేతనాలు దక్కుతున్నాయని అంటున్నారు. ఇదొక పాజిటివ్ స్వరం.
ఇక, యువత కూడా హ్యాపీగానే ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను అమలు చేయడం ద్వారా ఉద్యోగ కల్పనకు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అదేవిధంగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా.. కూడా ఉపాధి, ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తోంది. పరిశ్రమలు కూడా వస్తున్నా యి. ఈ పరిణామాలు యువతలో సంతోషాన్ని నింపుతున్నాయి. ఇప్పుడు వారు ఇతర విషయాలపై దృష్టిమానేసి.. చదువులు, పోటీ పరీక్షలపై దృష్టి పెడుతున్నారు.
ఇక, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1) పింఛన్ల పెంపు. ఇది సాధారణం గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నెలకు రూ.4000 చొప్పున అందించడాన్ని అందరూ హర్షిస్తున్నారు. అయితే.. 2వ కీలక అంశం.. గ్రామీణ రహదారులను బాగు చేయడం. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పూర్తయ్యాయి కూడా. దీంతో ఆయా గ్రామీణులు కూటమి సర్కారుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నది స్పస్టంగా తెలుస్తోంది. ఈ పరిణామం.. వైసీపీకి.. జగన్ కు కూడా అవకాశాలు తగ్గించేస్తోందని అంటున్నారు పరిశీలకులు.