=

పశ్చిమ బెంగాల్ పోలీసులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం..

మీరు చదివింది నిజమే. ఆంధ్రప్రదేశ్‌కు చాలా దూరంగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపైనా, అక్కడి పోలీసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేనా మీరు పాటించే లౌకికత్వం?” అంటూ నిప్పులు చెరిగారు. లౌకికత్వం అంటే అందరికీ సమానంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరి విషయంలో లౌకికత్వం కవచంగా మారుతోందని, మరికొందరి విషయంలో ఖడ్గంగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. “ఇదేం పోలీసింగ్?” అంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పటివరకు పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోలేదు. ఆయన తమిళనాడు, కర్ణాటక వరకే పరిమితమయ్యారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న ఓ అరెస్టుపై పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘ఈ అరెస్టు సరే… కానీ మిగిలిన అరెస్టుల సంగతేంటి?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసిన అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతల సంగతేంటి? అంటూ సీఎం మమతా బెనర్జీ (దీదీ)ని ప్రశ్నించారు.

అసలు ఏం జరిగింది?

‘ఆపరేషన్ సిందూర్’ పై పశ్చిమ బెంగాల్‌కు చెందిన శర్మిష్ఠ ముఖర్జీ అనే యువతి ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆమె న్యాయశాస్త్రం చదువుతోంది. అందులో కొన్ని లా పాయింట్లు కూడా ఆమె ఉదహరించారు. ఈ సంఘటన గత వారంలో జరిగింది. ఈ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో శర్మిష్ఠ వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ, వివాదం చెలరేగింది. దీంతో కోల్కతా పోలీసులు వెంటనే స్పందించి ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. లౌకికవాదాన్ని దెబ్బతీసినట్లు ఆమెపై అభియోగాలు మోపారు.

ఈ ఘటనపైనే పవన్ కల్యాణ్ స్పందించారు. లౌకికవాదం పేరుతో ఒకవైపు మత కసి తీర్చుకుంటూ, మరోవైపు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినవారిని కాపాడే ప్రయత్నం చేయడాన్ని ఆయన తుప్పులు పేల్చారు. ‘‘లౌకికవాదం అంటే అందరికీ సమానంగా ఉండడమే కాదా? సనాతన ధర్మాన్ని అవమానించిన అధికార పార్టీ నేతలపై కేసులు పెట్టారా? వాళ్లు అసలు క్షమాపణలు చెప్పారా? ఇదేనా మీ లౌకికత్వం?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.