సాధారణ ప్రజానీకానికీ.. గిరిజనులకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. సాధారణ ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒకటి వారికి కనిపించాలి. ప్రభుత్వాలు వారిని మెప్పించాలి. ఎప్పటికప్పుడు ప్రచారాలకు పడిపోతూ ఉంటారన్న పేరు కూడా ఉంది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు వేయని వ్యూహాలు లేవు. ప్రకటించని ఫథకాలు కూడా లేవు. అయినా..వారి ఓటు బ్యాంకుపై ఎప్పుడు సందిగ్థతే కొనసాగుతుంది. ఎప్పుడూ సందేహాలు..ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటాయి. చివరకు రిజల్ట్ వచ్చే వరకు కూడా పార్టీలకు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది.
కానీ.. గిరిజనుల పరిస్థితి అలాకాదు. వారికి ఉడత సాయం చేసినా.. కొండంత అండగా ఉంటారు. మేలును చిరకాలం గుర్తు పెట్టు కుంటారు. తమకు ఏ చిన్న సాయం చేసిన వారినైనా వారు.. జీవితకాలం నిలబెట్టుకుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ గుణాన్ని గమనించి.. గిరిజనులకు ఉడత సాయం కింద.. వైద్య సాయం చేశారు. ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చారు. ఇది ఆయనను మరోసారి అధికారంలోకి వచ్చేలా చేసింది. గిరిజన తండాల్లో వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేసుకునేలా చేసింది. అంతేకాదు.. ఆయన తర్వాత కూడా.. ఆయన కుమారుడు జగన్‌లో వైఎస్‌ను చూసుకునేలా చేసింది. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో వైసీపీకి ఓటు బ్యాంకు స్థిరపడింది.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే పరిణామాలు.. పవన్ కల్యాణ్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. గిరిజనులు ఇప్పుడు పవన్ నామస్మరణలో మునుగుతున్నారు. చేసిన సాయం కన్నా.. పవన్‌లోని మనసును చూస్తున్నారు. వారిని కలుసుకోవడం, వారి కష్టాలు వినడంతో పొంగిపోతున్నారు. అంతేకాదు.. గిరిజనులకుచెప్పులు పంపించడం దగ్గర నుంచి తాజాగా రహదారుల నిర్మాణం వరకు పవన్ చేసిన మేలును వారు వేనోళ్ల కొనియాడుతున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పలు గిరిజన ప్రాంతాలను కలుపుతూ.. వేసిన ఒకే ఒక్క కిలో మీటరు తారు రోడ్డు.. పవన్ గ్రాఫ్‌ను కొన్ని వందల కిలోమీటర్ల మేరకు పెంచిందంటే అతిశయోక్తికాదు.
ఇప్పటి వరకు డోలీ మోతలు.. నడక మార్గాలుగానే ఉన్న రహదారిని 88 లక్షల రూపాయలను ఖర్చు చేసి పవన్ కల్యాణ్ ఏకాగ్ర తతో ప్రాజెక్టును పూర్తి చేయించారు. తాజాగా ఇది గిరిజనులకుఅందుబాటులోకి వచ్చిందని పవన్ పేర్కొన్నారు. ఇది గిరిజను లను అమితోత్సాహానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు రోడ్డు అన్న మాటే ఎరుగని తండాలు.. పవన్ ప్రయత్నంతో పండగ చేసుకుంటున్నాయి. అంతేకాదు.. పవన్ కృషిని అభినందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని కిలోమీటర్ల మేరకు రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలు.. గిరిజనులను జనసేన వైపు నిలబెడుతున్నాయి. పవన్‌కు జైకొట్టిస్తున్నాయి. తమ నాయకుడిగా గిరిజనులు భావించేలా చేస్తున్నాయి. ఇక, మార్పు మొదలైందన్న సంకేతాలు వస్తున్నాయి.