కుప్పంలో చంద్రబాబు పీఏ భారీ కుంభకోణం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ పై కేసు నమోదైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ల వ్యవహారంలో మనోహర్ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఆ డిపాజిట్లపై మనోహర్ రూ. 12 లక్షల లోన్ తీసుకొని…ఆ డబ్బును స్వాహా చేసినట్లు వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విద్యాసాగర్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు….మనోహర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. దీంతోపాటు, కుప్పం టౌన్ బ్యాంకులో రూ. 1.9 కోట్ల కుంభకోణం జరిగిందన్న ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొందరు ప్రముఖ వ్యక్తులు లోన్లు తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని స్వాహా చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

అయితే, సదరు ప్రముఖ వ్యక్తులకు బ్యాంకు సిబ్బంది అండగా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కుప్పం టౌన్ బ్యాంకు మేనేజర్, అప్రైజర్ మరో ఇద్దరు సిబ్బంది అండతోనే ఈ కుంభకోణం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ నలుగురిని బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే మనోహర్ పై విద్యాసాగర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కాగా, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అని తెలుస్తోంది. వ్యవసాయానికి ఇవ్వాల్సిన నిధులను మనోహర్ పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. మనోహర్‌ సిఫారసుతో సదరు బ్యాంకు పలువురికి అడ్డగోలుగా లోన్లు మంజూరు చేయడం చర్చనీయంశమైంది.

మనోహర్ తన పలుకుబడితో ఇప్పించిన లోన్లను రికవరీ చేయలేక బ్యాంకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. లోన్లు తీసుకున్న వారు రికవరీ చేయకపోడంతోనే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది.అంతేకాదు, ఈ కుంభకోణం వెనుక కుప్పానికి చెందిన కొందరు బడా నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా 2కోట్ల 97 లక్షల వరకు అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. చంద్రబాబు సొంత ఇలాఖాలో చంద్రబాబు పీఏ అధికార దుర్వినియోగానికి పాల్సడడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.