-->

బాబు బాటలోకి వచ్చేసిన జగన్

నిజమే… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాటలోకి మార్చేస్తున్నారు. ఇదివరకు తనదైన శైలిలో సాగిన జగన్… మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో డంగైపోయారు. రోజుల తరబడి తన అపజయానికి కారణమేమిటన్న దానిపై తన మస్తిస్కానికి పదును పెట్టారు. ఈ మేధోమథనంలో తన తప్పేంటో తెలుసుకున్న జగన్… ఇకపై తన పొలిటికల్ జర్నీని బాబు బాటలోకి మార్చేస్తున్నారు. ఇందుకు జూన్ 4ను ఆయన ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.

గతేడాది జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఏపీలోని 175 స్థానాల్లో కూటమి పార్టీలు ఏకంగా 164 స్థానాలను దక్కించుకోగా… అప్పటిదాకా 151 సీట్లతో బలీయంగా కనిపించిన వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయింది.కార్తకర్తే అధినేత అన్న నినాదంతో సాగిన టీడీపీ… కూటమి విజయంలో కీలక భూమిక పోషించించిందని చెప్పాలి. చాలా రోజుల సమాలోచనల ద్వారా జగన్ ఈ విషయాన్ని గుర్తించినట్లున్నారు. ఈ కారణంగానే 2019 నుంచి కార్యకర్తలను పట్టించుకోని తన తప్పును బహిరంగంగానే ఒప్పుకుంటున్న జగన్… ఈ దఫా మాత్రం కార్యకర్తలకే పెద్ద పీట వేస్తానని పదే పదే చెబుతున్నారు.

ఇక టీడీపీ విషయానికి వస్తే… 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో తన కార్యకర్తలపై ఎక్కడ దాడులు జరిగినా పార్టీ అధినాయకత్వం అక్కడ వాలిపోయింది. బాధితులకు పూర్తి అండగా నిలిచింది. అందులో భాగంగానే గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను వైసీపీ శ్రేణులు హత్య చేశాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు స్వయంగా గ్రామానికి వెళ్లి చంద్రయ్య అంత్యక్రియల్లో స్వయంగా పాలుపంచుకున్నారు. ఇటీవలే చంద్రయ్య కుమారుడికి సర్కారు ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ తరహా చర్యలతో పార్టీ శ్రేణుల్లో అదినాయకత్వం పట్ల ఎనలేని నమ్మకం పెంపొందింది. ఇదే విషయాన్ని జగన్ కూడా గమనించినట్లున్నారు.

గతేడాది జూన్ 4న కౌంటింగ్ రోజున పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఉప సర్పంచ్ గా ఉన్న కొర్లగుంట నాగమల్లేశ్వర రావును ఫలితాలు వెలువడిన మరుక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. అదే సమయంలో టీడీపీ జనసేన శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేశాయట. ఆ తర్వాత గ్రామం విడిచి వెళ్లాలని టీడీపీ, జనసేన శ్రేణులు బెదిరింపులకు దిగాయట. పోలీసులూ వారికి వత్తాసు పలికారట. ఈ గొడవలెందున్న భావనతో తండ్రి సూచనతో గుంటూరులోని సోదరుడి వద్దకు వెళ్లిన మల్లేశ్వరరావు.. తనదేం తప్పు లేకున్నా వేధిస్తున్నారన్న మనస్తాపంతో గతేడాది జూన్ 6న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారట. నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోగా… జూన్ 10న ఆయన మరణించారు.

ఈ విషయాన్ని గుర్తించిన జగన్ సరిగ్గా… నాగ మల్లేశ్వరరావుపై వేధింపులు మొదలైన జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే నాగ మల్లేశ్వరరావు మరణం విషయాన్నిమాత్రం నాడు జగన్ ప్రస్తావించలేదు గానీ… జూన్ 4న వెన్నుపోటు నిరసనల్లో బాగంగా జగన్ రెంటపాళ్ల కు వెళ్లి నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అంతేకాకుండా గ్రామంలో నాగ మల్లేశ్వర రావు విగ్రహాన్ని కూడా జగన్ ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇది మొదలు పార్టీ కార్యకర్తల గురించి బాబు ఎలాగైతే ఆలోచిస్తున్నారో.. అదే రీతిన జగన్ కూడా ముందుకు సాగనున్నట్లుగా సమాచారం.