-->

నెలలో 15 రోజులు.. రెండు పూటలా రేషన్: పవన్

ఏపీలో రేపటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ సమూలంగా మారిపోనుంది. గత వైసీపీ సర్కారులో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వాహనాలతో వెళ్లి రేషన్ పంపిణీ జరగగా… ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు… పాత పద్ధతిలో రేషన్ డీలర్ల దుకాణాల వద్దే రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. రేషన్ పంపిణీపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాతే కూటమి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం ఓ ఆసక్తికర ప్రకటనను విడుదల చేశారు. కూటమి పాలనలో కొత్త రేషన్ పంపిణీ విధానం జనరంజకంగా జరిగి తీరుతుందని ఆయన సదరు ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక వైసీపీ హయాంలో వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే రేషన్ సరుకుల పంపిణీలో ఏం జరిగిందన్న దానిపైనా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి వద్దకే రేషన్ సరుకులు అంటూ వైసీపీ ప్రభుత్వం ఏదో బడాయికి పోయిందని, అయితే ఆ విధానం మాటున రేషన్ సరుకుల నిలువు దోపిడీ జరిగిందని పవన్ ఆరోపించారు. రేషన్ బండితో వచ్చే వ్యక్తులు నెలలో రెండు, మూడు రోజులు మాత్రమే ఏదో కూడలిలో నిలుచుని లబ్ధిదారులను పిలిచేవారన్నారు. అది కూడా తమకు ఇష్టం వచ్చిన సమయంలో వచ్చేవారని… ఫలితంగా పనులు మానుకుని కూడా దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాల ప్రజలు రేషన్ కోసం ఎదురు చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలా లబ్ధిదారులకు అరకొర రేషన్ సరుకులను పంపిణీ చేసిన వాహనం దారులు మిగిలిన రేషన్ సరుకులను బ్లాక్ విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారన్నారు. ఇలా పోగైన రేషన్ సరుకులు కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా దేశం దాటి వెళ్లిందని కూడా పవన్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు గమనించి.. ఆ దోపిడీ నివారణ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే రేషన్ షాపుల వద్దే సరుకుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ విధానాన్ని లబ్ధిదారులకు మరింత ప్రయోజనకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

నెలలో 15 రోజుల పాటు… అంటే… ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ దాకా రేషన్ షాపులు తెరిచే ఉంటాయని పవన్ తెలిపారు. అంతేకాకుండా ఈ 15 రోజుల్లో రెండు పూటలా రేషన్ షాపుల నుంచి సరుకులు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. రేషన్ షాపులు తెరిచి ఉండే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా… తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దారా సరుకులను తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వారికి వారి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులను అందిస్తామని తెలిపారు. జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ రేషన్ సరుకల కొత్త తరహా పంపిణీ జనరంజకంగా అమలు అవుతుందని ఆకాంక్షిస్తున్నానని పవన్ అభిలషించారు.