పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పిన తర్వాత వైసీపీ మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి పెద్ద చిక్కే వచ్చి పడ్డట్టు ఉంది. తనకు సంబంధించిన ఏ చిన్న వార్త, ఎక్కడ కనిపించినా ఆయన హడలిపోతున్నారు. ఆ వెంటనే వివరణలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా ఎక్స్ వేదికగా ఓ వివరణ పోస్ట్ చేసిన సాయిరెడ్డి… తాజాగా శుక్రవారం రాత్రి కూడా మరో వివరణతో కూడిన పోస్టును పెట్టారు. ఇందులో కూడా తనకు సంబంధం లేని, తన ప్రమేయం లేని, తాను పలకని మాటలను తనకు అంటగడుతూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
అయినా ఇప్పుడు ఏం జరిగిందన్న విషయానికి వస్తే… ఇటీవలే సాయిరెడ్డి సతీసమేతంగా తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే. స్వామి వారి దర్శనం తర్వాత తిరుపతిలోనో, లేదంటే విశాఖలోనో ఆయన తన సన్నిహితులతో పలు కీలక విషయాలను ప్రస్తావించారట. ఈ విషయాల్లో లిక్కర్ కేసులో జగన్ అరెస్టు ఖాయమని, అందుకు జూన్ 10న ముహూర్తం కూడా ఖరారు అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారట. ఈ విషయాలతో పలు మీడియా సంస్థలు కథనాలు రాశాయి. ఈ కథనాలు చూసిన వెంటనే సాయిరెడ్డి వివరణ ఇచ్చేశారు.
ఈ వివరణలో సాయిరెడ్డి ఏమంటారంటే… జగన్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు కొన్ని ఊరూపేరూ లేని పత్రికలు, ఛానెళ్లు చేస్తున్న ప్రచారం తప్పని ఆయన పేర్కొన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ఆఫ్ ది రికార్డ్ గానీ, ఆన్ ది రికార్డ్ గానీ తాను ఎక్కడా మాట్లాడలేదని తెలిపారు. కేవలం కోటరీ వల్లే తాను వైసీపీని వదిలానే తప్పించి జగన్ కు హానీ కలిగించే విధంగా సాగనని తెలిపారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని… ఈ కారణంగా తనకు ఏ రాజకీయ నేతతో శతృత్వం లేదని కూడా ఆయన వెల్లడించారు. ఏదైనా చెప్పాలనుకుంటే… తానే నిస్సంకోచంగా మీడియా ముందుకు వస్తానని… లేదంటే తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెడతానని, ఇతరత్రా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన కోరారు.
ఇదిలా ఉంటే…మొన్నామధ్య లిక్కర్ స్కాం గురించి వివరించడానికి తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగన్… సాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు సాయిరెడ్డి అమ్ముడుబోయారంటూ జగన్ ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలపై సాయిరెడ్డి స్పందించారని.. జగన్ తీరును ఖండిండమే కాకుండా.. జగన్ కేరెక్టర్ ను ప్రశ్నిస్తూ కూడా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని కొన్ని మీడియా సంస్థలు రాశాయి. దీనిపైనా సాయిరెడ్డి వేగంగా స్పందించారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటివరకు తాను స్పందించలేదని, అవసరం వచ్చినప్పుడు తానే నేరుగా స్పందిస్తానని తెలిపారు. అయితే తాను జగన్ వ్యాఖ్యలను ఖండించినట్లుగా జరుగుతున్న ప్రచారం అబద్ధమని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.