తెలుగు నేల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యర్థుల ఆరోపణలను పెద్దగా పట్టించుకోరు. సదరు ఆరోపణలు ఒకింత ఘాటుగా ఉన్నా కూడా నేరుగా మీడియా ముందుకు వచ్చి… వాటిని ఖండించడం, తన వ్యక్తిత్వం ఏమిటో చెబుతూ సాగడం ఆయన తీరు. దాదాపుగా ఏ నేత గురించిన వ్యక్తిగత విమర్శల జోలికి హరీశ్ రావు వెళ్లరనే చెప్పాలి. అలాంటి హరీశ్ ఇప్పుడు బాగా హర్ట్ అయిపోయారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలతో ఆయన నిజంగానే హర్ట్ అయ్యారని చెప్పాలి.
కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు హరీశ్ రావు, నాడు కేసీఆర్ కేబినెట్ మంత్రిగా పనిచేసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ లు త్వరలోనే విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆదేశాల మేరకు హరీశ్ రావు ఇటివల షామీర్ పేటలోని ఓ ఫాం హౌస్ లో ఈటెలతో రహస్యంగా భేటీ అయ్యారని మహేశ్ గౌడ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? అన్న విషయాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారని… విచారణలో అందరం ఒకే తరహా సమాధానాలు ఇద్దామని వారు తీర్మానించారని కూడా ఆయన ఆరోపించారు. శుక్రవారం మహేశ్ చేసిన ఈ ఆరోపణలు కలకలమే రేపాయి.
మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణలపై శనివారం ఉదయమే సోషల్ మీడియా వేదికగా స్పందించిన హరీశ్ రావు.. పీసీసీ చీఫ్ హోదాలో ఉండి మహేశ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గు చేటని కూడా హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలకు తిలోదకాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బాటలోనూ మహేశ్ కూడా సాగుతున్నారని ఆరోపించారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం అయిపోవని తేల్చిచెప్పారు. పెళ్లిలోనో, చావులోనే కలిసిన సందర్భాలే తప్ప మహేశ్ ఆరోపిస్తున్నట్లుగా ఇతర పార్టీ నాయకులను గానీ, బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేతలను గానీ వ్యక్తిగతంలో కలిసింది లేదని ఆయన స్పష్టం చేశారు.
అంతటితో ఆగని హరీశ్ రావు విలువలతో కూడిన రాజకీయాలే తాను చేస్తానని పేర్కొన్నారు. మహేశ్ గౌడ్ మాదిరిగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడనని కూడా ఆయన ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పటికైనా ఇలంటి ఆరోపణలు మానుకుని…స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా దృష్టి పెట్టాలని మహేశ్ కు ఆయన సూచించారు. హరీశ్ రావు ట్వీట్ చూస్తే… మహేశ్ గౌడ్ చేసిన ఆరోపణలతో ఆయన బాగానే హర్ట్ అయ్యారని చెప్పక తప్పదు.