టీడీపీలో నాయకులకు చంద్రబాబు అభయం ప్రసాదించారు. మహానాడు వేదికగా.. ఆయన వరుసగా చేసిన రెండు ప్రసంగాల్లో పైకి ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయకపోయినా.. ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇతరులను ఎవరినీ పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు తీసుకున్నవారిని కూడా కంట్రోల్ చేస్తున్న విధానాలను ఆయన చెప్పకనే చెప్పారు. తద్వారా.. ఇప్పుడున్న వారిదే పైచేయి అన్న మాటను ఆయన పంపించారు.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు.. గత వైసీపీ హయాంలో కేసులు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన నాయకులు కూడా.. బిక్కుబిక్కుమంటున్నారు. తమ పరిస్థితి ఏంటి? మరింత మంది కొత్త వారు వస్తే..తమ నియోజకవర్గంలో తమ హవా తగ్గితే ఏం చేయాలి? అనే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే.. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. కొత్తనీరు వచ్చిన పాత నీటిని తన్నేసినట్టుగా నియోజకవర్గాల్లో సీనియర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. జంపింగులకు ఆయన దాదాపు గేట్లు మూసేశామన్న సంకేతాలు ఇచ్చారు. తద్వారా.. నియోజకవర్గాల్లో ఇప్పుడున్న వారిదే పైచేయి అన్న సంకేతాలను పంపించారు. ఇది పార్టీలో నాయకుల అసంతృప్తులకు బ్రేకులు వేసింది. అంతేకాదు. మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు కూడా ప్రత్యామ్నాయం కల్పించింది. ఇప్పటి వరకు తమ ప్రాధాన్యం తగ్గుతుందని భావించిన వారికి కూడా చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టు అయింది.
ఒకరకంగా చెప్పాలంటే.. తమ్ముళ్ల రాజకీయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు.. కోవర్టు రాజకీయాలు చేసేవారికి కూడా బలమైన సంకేతాలనే పంపించారు. ఇది కూడా తమ్ముళ్లను ఖుషీ చేస్తోంది. నియోజకవ ర్గ స్థాయిలో నాయకులు తమ పనిని తాము చేసుకునేందుకు అవకాశం కల్పించడంతోపాటు.. భరోసా కూడా ఏర్పడింది. వేరే నాయకులు వస్తారని.. తమ రాజకీయాలకు గండి పడుతుందని అనుకునే వారు ఇక నుంచి ఆ ఆలోచనను పక్కన పెట్టి.. తమ పనులు చేసుకునేందుకు మార్గం సుగమమైంది.