కడపలో నిర్వహించిన మహానాడు చివరి రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. సాధారణంగా చంద్రబాబు మైకు పట్టుకుంటే వదిలే రకం కాదన్న భావన ఉంది. ఈ దఫా కూడా అదే జరిగింది. అయితే.. ఈ సారి మైకు పట్టుకుని గంటల తరబడి ఆయన ప్రసంగించినా.. మెరుపులు కురిపించారు. ప్రజల్లో అభివృద్ధి బీజాలు వేశారు. దీంతో కృతకంగా సాగుతుందని ముందు అనుకున్నా.. చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.
మరీ ముఖ్యంగ ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అనే నినాదాన్న అందుకుని చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తద్వారా ఆయన ఎవరిని హెచ్చరించారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులకు మోడీ చెక్ పెట్టారని.. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ద్వారా ఆర్థిక నేరస్తులను ఏరేస్తామని ఆయన శపథం చేశారు. ఇది మంచి పరిణామమే. అయితే.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇది సాధ్యమేనా? అనేది ప్రశ్న.
పైకి ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ, ఎన్నికల విషయానికి వస్తే.. ప్రతి ఐదేళ్లకు ఎన్నికల ఖర్చు పెరుగు తూనే ఉంది. ఎక్కడా ఎవరూ తక్కువగా ఖర్చు చేస్తున్న దాఖలు కనిపించడం లేదు. అసెంబ్లీ నియోజక వర్గంలో 30 కోట్లు ఖర్చు పెట్టడం మంచి నీళ్ల ప్రాయంగా మారిన నేటి ఎన్నికల రాజకీయాల్లో క్లీన్ పాలిటిక్స్ అనే మాట.. వినేందుకు బాగానే ఉన్నా.. చేసేందుకు మాత్రం అడ్డంకులు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. తమకు డబ్బులు ముట్టలేదని.. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వేళ.. దాడులు చేసిన ఓటర్లు దీనికి ఉదాహరణ.
ఒకవేళ.. తాను చెబుతున్న ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్‌ను ప్రత్యర్థుల వరకే పరిమితం చేయాలని అనుకుంటే.. అది సాధ్యం కావొచ్చు. కానీ.. సొంతపార్టీ పరిస్థితిని అంచనా వేసుకుంటే.. మాత్రం ఇది చేయలేక పోవచ్చు. అప్పుడు మళ్లీ చంద్రబాబుకు ఎదురు ప్రశ్నలు.. సవాళ్లు కూడా ఎదురవుతాయి. కాబట్టి.. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అనేది పైకి చెబుతున్నంత ఈజీ కాదు. చేస్తే.. మంచిదే. దీనికి చాలా సాహసం, ధైర్యం కావాలి. కానీ.. నిరంతర ప్రభుత్వం కోరుకుంటున్న దరిమిలా.. దీనిని ఏమేరకు సక్సెస్ చేస్తారన్నది చూడాలి.