‘వాళ్లు కడపలో పెడితే, మనం కుప్పంలో పెడదాం’
ప్రస్తుతం టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును తొలిసారిగా కడపలో ఏర్పాటు చేశారు. ఇది వైసీపీ అధినేత జగన్‌కు కంచుకోట అనే విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా దూకుడు చూపించాలని భావించిన చంద్రబాబు, నేరుగా కడపలోనే ఈసారి మహానాడుకు శ్రీకారం చుట్టారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చకు దారితీసింది.
ఇదిలా ఉంటే, వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహానాడుపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు పక్కన పెట్టారని, స్వోత్కర్ష మరియు పరనిందలకే మహానాడును పరిమితం చేశారని పలువురు నేతలు పేర్కొన్నారు. అలాగే, “సూపర్ సిక్స్” హామీల గురించి చంద్రబాబు ప్రస్తావించలేదని జగన్ వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో ఓ మహిళా నాయకురాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది కూడా వచ్చే ఏడాది నిర్వహించనున్న వైసీపీ ప్లీనరీకి సంబంధించి కావడం గమనార్హం. వచ్చే ఏడాది జూలైలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని జగన్ ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహించుకోవాలని కూడా వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుతం టీడీపీ మహానాడును జగన్ స్వస్థలమైన కడపలో నిర్వహిస్తున్నారని, కాబట్టి మన వైసీపీ ప్లీనరీను కుప్పంలో నిర్వహించుకుందాం, అప్పుడే ‘ఢీ అంటే ఢీ’ అన్నట్టుగా రాజకీయంగా బలమైన సందేశం వెళ్లుతుందని ఆ మహిళా నాయకురాలు పేర్కొన్నారు.
దీనిపై కొద్దిసేపు మౌనం వహించిన జగన్, ఇతర నాయకుల అభిప్రాయాలు కూడా వినాలని అన్నారు. మెజారిటీ నాయకులు పోటాపోటీగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన జగన్, “మనమూ పోటాపోటీగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోము. ప్రజల కోసం చేసే కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా ఒకటే. ప్రజలను మనవైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నమే ముఖ్యం. వేదిక ఎక్కడ అనే విషయంలో నాకు వదిలేయండి” అని స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates