=

ఇక, గేట్లు మూసేశారా? టీడీపీలో బిగ్ టాపిక్!

మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ఇతర పార్టీల నుంచి చేర్చుకునే నాయకుల విషయంలో ఆయన తేల్చిచెప్పేశారు. కోవర్టుల అంశాన్ని ఆయన ప్రధానంగా చర్చించారు. అంతేకాదు, సైలెంట్‌గా పార్టీ మారి వైలెంట్ వ్యవహారాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. దీంతో ఇక, జంపింగులకు టీడీపీ గేట్లు మూసేసిందన్న చర్చ మహానాడులోనే జరుగుతుండటం గమనార్హం.

ఎందుకిలా?

గత ఏడాది ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయం చూసిన చాలా మంది నాయకులు సైలెంట్‌గా జెండా మార్చేశారు. వీరిలో చాలా మంది టీడీపీ జెండా కప్పుకొన్నారు. వాస్తవానికి ముందు వెనుక అన్నీ ఆలోచించుకున్నాకే టీడీపీలోకి నాయకులను ఆహ్వానించారు. ఇలానే పల్నాడు, నెల్లూరు జిల్లాల్లోనూ నాయకులను చేర్చుకున్నారు. కానీ, ఆ తర్వాత వారే టీడీపీ నాయకులను హత్య చేశారన్నది టీడీపీలో జరుగుతున్న చర్చ.

పల్నాడులో జరిగిన జంట హత్యలు, నెల్లూరులో జరిగిన చౌదరి హత్యలకు కారణం గతంలో ఉన్న రాజకీయ విద్వేషాలేనని చంద్రబాబు వరకు చేరింది. అంటే, వైసీపీలో ఉండగా తీవ్రంగా విభేదించిన వారు తర్వాత పార్టీ మారారు. ఈ క్రమంలోనే ఆధిపత్య రాజకీయాల కోసం టీడీపీలో సంస్థాగతంగా ఉన్నవారిపై దాడులు చేసి హత్యలకు దిగారన్నది చంద్రబాబుకు రిపోర్టులు చేరాయి. ప్రస్తుతం వారి పై కేసులు పెట్టారు. అరెస్టుల వరకు విషయం వెళ్లింది.

కానీ, ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు కూడా పార్టీపై ఒకింత కినుక వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్నవారిని పార్టీలో చేర్చుకుంటే ఇదే జరుగుతుందన్న సమాచారం ఇచ్చారు. దీంతోనే పార్టీలోకి దాదాపు వైసీపీ నాయకులు ఎవరినీ చేర్చుకునే అవకాశం లేకుండా చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అదేసమయంలో కోవర్టులు కూడా వారే అయి ఉంటారని, అందుకే తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి వచ్చేవారికి గేట్లు మూసేశారని స్పష్టంగా తెలుస్తోంది.