=

తండ్రీకొడుకుల నోట ఆనాటి చేదు జ్ఞాపకం!

టీడీపీ వార్షిక వేడుక మహానాడు కడప కేంద్రంగా గురువారం సాయంత్రంతో ముగిసింది. ముగింపు రోజు అయిన గురువారం దాదాపుగా 7 లక్షల మందితో టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఒకేసారి 7 లక్షలకు పైగా జనం కడపకు రావడంతో కడప నగర పరిసరాలు పసుపు కండువాలతో నిండిపోయింది. చివరి రోజు అశేష జన వాహినిని చూసి ఉప్పొంగిన పార్టీ అధినాయకత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లు ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి నోటా గతంలో చంద్రబాబుకు జరిగిన ఓ చేదు అనుభవం ప్రస్తావనకు వచ్చింది. అదే… అలిపిరిలో చంద్రబాబు టార్గెట్ గా నక్సలైట్లు పేల్చిన క్లెమోర్ మైన్ ఘటన.

నాడు అప్పటికే ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్లుగా సీఎంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు… దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి గా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో మైక్రోసాఫ్ట్ లాంటి ఐటీ సంస్థలను ఆయన హైదరాబాద్ కు తీసురుకాగలిగారు. ఇలాంటి క్రమంలో 2003 అక్టోబర్ 1న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు టూర్ షెడ్యూల్ ను ముందుగానే పసిగట్టిన నక్సలైట్లు అలిపిరి దాటిన వెంటనే కొద్ది దూరంలో రోడ్డుకు వారగా క్లమోర్ మైన్లను ఏర్పాటు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ రాగానే వాటిని పేల్చారు. ఈ పేలుడు ధాటికి చంద్రబాబు కారు గాల్లోకి ఎగిరి గిరగిరా తిరుగుతూ కింద పడిపోయింది. అయితే అది బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు కావడంతో చంద్రబాబు సహా ఆయనతో ప్రయాణిస్తున్న దివంగత నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తదితరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

మహానాడు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక మీదకు చంద్రబాబు చేరుకుంటున్న సమయంలో ఓ పాటను ప్లే చేశారు. ఆ పాటలో చంద్రబాబుకు ఎదురైన పలు చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ., వాటిని అన్నింటినీ తట్టుకుని చంద్రబాబు నిలిచారనే సందేశం వచ్చేలా ఆ పాట సాగింది. లోకేశ్ తన ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… సదరు పాట వినగానే చంద్రబాబు అరెస్టు అయి రాజమండ్రి జైలులో ఉన్న విషయం గుర్తుకు వచ్చి చాలా బాధ వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన అలిపిలి క్లెమోర్ మైన్ పేలుడు ఘటనను కూడా ప్రస్తావించారు. అంత పెద్ద ప్రమాదం నుంచి చంద్రబాబు బతికి బట్ట కట్టారంటే… టీడీపీ శ్రేణుల పుణ్యమేనని, ప్రజలకు చంద్రబాబు ఇంకా సేవ చేయాల్సింది చాలా ఉందన్న కారణంగానే ఆ దేవుడే ఆ ప్రమాదం నుంచి చంద్రబాబును రక్షించారని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే… లోకేశ్ ప్రసంగం ముగిసిన తర్వాత పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించారు. ఆ తర్వాత ముగింపు ప్రసంగం మొదలుపెట్టిన చంద్రబాబు అలిపిరి ఘటనను ప్రస్తావించారు. టీడీపీని లేకుండా చేస్తామన్న వారు వారే అడ్రెస్ లేకుండా పోయారని సెటైర్లు వేశారు. కడపలో మహానాడు పెడతామంటే… అది జరిగే పనేనా అన్న మాటలూ వినిపించాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగానే ఆయన అలిపిరి ఘటనను ప్రస్తావించారు. అలిపిరిలో నక్సలైట్లు తనను టార్గెట్ చేసి పేల్చిన క్లెమోర్ మైన్ దాడులే తనను ఏమీ చేయలేకపోయాయన్న చంద్రబాబు… వైసీపీ ఉడుత ఊపులకు భయపడతానా? అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా అలిపిలి పేలుడును తొలుత లోకేశ్, ఆ తర్వాత చంద్రబాబు ఒకే వేదికపై ఒకే రోజు ప్రస్తావించడం గమనార్హం.