కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు సందర్భంగా ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు కోవర్టులున్నారని, పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీల వారు ఆ కోవర్టులను టీడీపీలోకి పంపుతున్నారని, టీడీపీ నేతల మధ్య కలహాలు రేపడమే ప్రత్యర్థి పార్టీల, కోవర్టుల లక్ష్యమని అన్నారు. అయితే, వారి ఎత్తుగడలు పనిచేయవని చంద్రబాబు చెప్పారు. వారి ఎత్తులను చిత్తు చేస్తామని, కోవర్టులను ఏరిపారేస్తామని హెచ్చరించారు.
వలస పక్షులు పార్టీలోకి వస్తుంటాయి, పోతుంటాయని…కానీ, కార్యకర్తలే శాశ్వతమని చెప్పారు. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్టులుగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. మన వేలితో మన కన్ను పొడిపించాలని ప్రత్యర్థి పార్టీలు చూస్తున్నాయని చెప్పారు. టీడీపీ వాళ్లు..వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారని టీడీపీకి చెడ్డపేరు తేవడం… వంటి రెండు లాభాలు ప్రత్యర్థులకున్నాయని అన్నారు. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అని అన్నారు.
మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనిచేస్తే ఊరుకోబోనని, ఎవ్వరినీ ఉపేక్షించనని చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతోపాటు, సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసే ఆకతాయిల ఆగడాలను సహించబోనని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. అలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates