అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్న తమిళనాడు అదికార పార్టీ డీఎంకేపైకి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తన మిత్రపక్షమైన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించింది. ఎన్డీఏ రచించిన వ్యూహాన్ని పవన్ పక్కాగా అమలు చేసిన తమిళ గడ్డలోనే డీఎంకేకు గట్టి షాకిచ్చారు. నిత్యం ప్రాంతీయ వాదంలో తమను మించిన వారు లేరంటూ బీరాలు పలుకుతున్న డీఎంకే నేతలు కూడా తమ పూర్వ నేతల ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట కలకలమే రేపుతున్నాయి.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం ఉదయం ప్రారంభమైన సెమినార్ లో పవన్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన డీఎంకే అధినేత, దివంగత నేత కరుణానిధి పేరును ప్రస్తావించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను ప్రతిపాదించిన వారిలో కరుణానిధి కూడా ఒకరని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం ఒక్క తమిళ ప్రజలకే కాకుండా యావత్తు భారత జాతికి తెలుసునని ఆయన తెలిపారు. ఈ లెక్కన ఇప్పుడు ఎన్డీఏ అమలు చేయదలచిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం నాడు కరుణానిధి ప్రతిపాదించినదేనని పవన్ చెప్పుకొచ్చారు.
రాజకీయంగా ప్రత్యర్థులు అయినప్పటికీ కరుణానిది తదితరులు ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అమలు చేయడానికి సిద్ధపడిందని పవన్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు ఎన్డీఏతో భుజం కలిపి సాగాల్సిన తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ మాత్రం వ్యతిరేకిస్తుండటం నిజంగా ఆశ్చర్యం కలిగించేదేనని అన్నారు. తండ్రి ఆశయాన్ని కూడా కొనసాగించలేని స్థితిలో స్టాలిన్ ఉన్నారని పవన్ దుయ్యబట్టారు. కరుణానిధి పేరు చెప్పుకుని ఓట్లు వేయించుకునే స్టాలిన్ కరుణానిధి ఆశయసాధనలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వాస్తవానికి ఈ తరం నేతలకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై కరుణానిధి వైఖరి ఏమిటన్న దానిపై అంతగా స్పష్టత లేదనే చెప్పాలి. అందులోనూ చాలా ఏళ్ల క్రితం కరుణానిది ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనారోగ్యం చుట్టుముట్టి కుర్చీకే పరిమితం అయిన తర్వాత ఆయన పెద్దగా మాట్లాడిందే లేదు. ఈ నేపథ్యంలో కరుణానిధి విధి విధానాలు, ఆశయాలను స్టాలిన్ తనకు అనుకూలంగా మలచుకున్నారన్న భావన తమిళుల్లో కలిగేలా చేయడంలో పవన్ సఫలం అయ్యారని చెప్పక తప్పదు. మొత్తంగా తండ్రి కరుణానిది పేరు చెప్పి కుమారుడు స్టాలిన్ నోటికి పవన్ తాళం వేశారన్న విశ్లేషణలు ఆసక్తి రేకేత్తిస్తున్నాయి.