జపసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… దేశ రాజధానిలో ప్రధానితో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీని ముగించుకుని అటు నుంచి అటే నేరుగా తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లిపోయారు. చెన్నైలో ల్యాండ్ అయిన పవన్ కు అక్కడి బీజేపీ శాఖ కీలక నేతలంతా ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంథిరన్, మొన్నటిదాకా తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన బీజేపీ సీనియర్ మహిళా నేత తమిళిసై సౌందర రాజన్ ల ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పవన్ కు తమిళ సంప్రదాయాలతో స్వాగత సత్కారాలు చేశారు.
సరే… అసలు పవన్ చెన్నై ఎందుకు వెళ్లారంటే… రేపు బీజేపీ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరిట ఓ ప్రత్యేక సెమినార్ జరుగుతోంది. ఈ సెమినార్ లో కీలక ప్రసంగం చేసేందుకే పవన్ చెన్నై చేరారు. ఆదివారం రాత్రి చెన్నైలోనే బస చేయనున్న పవన్… సోమవారం ఉదయం సెమినార్ కు హాజరు కానున్నారు. ఎన్డీఏ మిత్రపక్షంగా జనసేన కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు అనుకూలంగానే ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎప్పుడో చెప్పేశారు కూడా. రేపు చెన్నై సెమినార్ లో కూడా పవన్ ఇదే వైఖరిని మరింత బలంగా వినిపించనున్నారని చెప్పక తప్పదు.
వాస్తవానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలను బయలకు తీసుకువచ్చిందే..తమిళనాట అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీనే. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా… దానికి వ్యతిరేకంగానే గళం వినిపిస్తున్న డీఎంకే.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కు ఒప్పుకునేది లేదని కూడా ఆ పార్టీ అవకాశం చిక్కిన ప్రతి సారి తన గొంతు వినిపిస్తూనే ఉంది. అయితే మెజారిటీ పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు అనుకూలంగా ఉండగా డీఎంకే డిమాండ్ వీగిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.
అయితే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన కీలక నిర్ణయాలపై దాదాపుగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని వస్తే మంచిది కదా. ఆ దిశగానే అడుగులు వేస్తున్న బీజేపీ… చెన్నైలో సెమినార్ పెడుతోంది. ఈ సెమినార్ కు మంచి వాగ్దాటి కలిగిన పవన్ ను ఆహ్వానించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెమినార్ లో పవన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై తనదైన శైలి వాదనలను వినిపించనున్నారు. ఫలితంగా డీఎంకే గడ్డ తమిళనాడులోనే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓ బలమైన గొంతు వినిపిస్తుందని చెప్పక తప్పదు. ఇదే జరిగితే… డీఎంకేకు నిజంగానే చాలా కష్టమేనని చెప్పక తప్పదు.