ఏపీ అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు మరో మూడురోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 27 నుంచి 29 మధ్య మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. అది కూడా వైసీపీ అధినేత జగన్ ఇలాకా.. కడపలో తొలిసారి నిర్వహిస్తున్నారు. కడపలోని జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం కమలాపురంలో మూడు రోజుల పసుపు పండగకు సన్నాహాలు సాగుతున్నాయి. అయితే.. ఇంతలోనే వైసీపీ ఈ మహానాడుపై విషం చిమ్మే ప్రయత్నాలు ప్రారంభించింది.
తాజాగా జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌కు.. మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సహా పలువురు నాయకులు భారీ వినతి పత్రం ఇచ్చారు. “టీడీపీ నిర్వహిస్తున్న.. మహానాడును అడ్డుకోండి. జరగకుండా ఆదేశాలు ఇవ్వండి. ఇప్పటికే ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయండి..” అని సదరు వినతి పత్రంలో పేర్కొన్నారు. అంతేకాదు.. మహానాడు కు వచ్చే వాహనాలను కూడా అనుమతించరాదని.. ఇప్పటికే ఇచ్చిన లైసెన్సులను రద్దు చేయాలని కూడా కోరారు. మహానాడు నిర్వహిస్తే.. మహా ప్రమాదం కొని తెచ్చుకున్నట్టేనని కూడా వ్యాఖ్యానించారు. దీనిని జాయింట్ కలెక్టర్ స్వీకరించారు.
ఎందుకు యాగీ?
వైసీపీ వాదన ప్రకారం.. రాష్ట్రంలోను, దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు మహానాడు నిర్వహిస్తే.. ఈ కేసుల తీవ్రత మరింత పెరుగుతుందని.. తద్వారా.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నా రు. ఇదే విషయాన్ని వినతి పత్రంలోనూ పేర్కొన్నారు. అయితే.. వాస్తవానికి ప్రస్తుతం కరోనా కేసులు ఒకటి అరా కనిపించినా.. దేశవ్యాప్తంగా ఎలాంటి అలెర్ట్ ప్రకటించలేదు. పైగా ఇదేమీ అత్యంత ప్రమాదకర వైరస్ అని ఎవరూ చెప్పలేదు. కేంద్రం కూడా.. దీనిని సీరియస్ ఎఫెక్టెడ్ వైరస్‌గా ప్రకటించలేదు.
అయినా కూడా.. వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా మహానాడుకు మోకాలడ్డే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే కరోనా బూచిని చూపిస్తున్నారని టీడీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ పుంజుకుంటుందన్న భయంతోనే వైసీపీ నాయకులు యాగీ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే.. తాము హైకోర్టులో కూడా ఈ విషయంపై పిటిషన్ వేస్తామని వైసీపీ నాయకులు చెప్పడం గమనార్హం.