బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణప్రదంగా భావిస్తున్నట్టు అప్పటి సీఎం కేసీఆర్ చెప్పా రు. అయితే.. ఈ కాళేశ్వరమే.. కాసులు కురిపించిందని.. కోట్లకు కోట్ల సొమ్మును వెనుకేసుకునేలా చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టాక అవకాశం కోసం ఎదురు చూశారు. ఇంతలోనే కాళేశ్వరానికి అనుసంధానంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు కూలింది. దీంతో కాళేశ్వరంపై దుమ్ముదులిపే చర్యలకు రంగం రెడీ చేసుకున్నారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేశారు. ప్రస్తుతం దీనికి మరో ఏడాది సమయం కూడా పెంచారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 5న మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు రావాలని రెండు రోజుల కిందట కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డను కాంగ్రెస్ నాయకులే బాంబులు పెట్టి పేల్చారని.. దీనిని తమపై రుద్దుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
వాస్తవానికి గతంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనపై కేసు పెట్టారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ పరిధిలో ఉంది. ఇంతలోనే మరోసారి కాంగ్రెస్‌పై కేటీఆర్ సేమ్ టు సేమ్ వ్యాఖ్యలు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కారు… తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ వర్గాల కథనం మేరకు.. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలను ప్రస్తుతం విచారిస్తున్న పీసీ ఘోష్ కమిషన్‌కు సమాంతరంగా మరో విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
అదే.. సీబీఐ. కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’ ప్రాజెక్టుగా గతంలో అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా ముదురుతున్న మాటల యుద్ధంతో ఏకంగా దీనిని సీబీఐకి అప్పగించే విషయంపై శుక్రవారం రాత్రి మంత్రివర్గంలో చర్చించినట్టు తెలిసింది. దీనికి మంత్రులు కూడా ఓకే చెప్పారని సమాచారం. అంటే..నేడో రేపో.. దీనిపై నిర్ణయం తీసుకుని.. కేంద్రానికి రిఫర్ చేయనున్నారు. బీజేపీ కూడా.. దీనిపై సీరియస్‌గానే ఉన్నదరిమిలా.. సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. బీఆర్ఎస్‌కు మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు.