చంద్రబాబును ఫాలో కావాలన్న మోదీ

ఏపీ సీఎంగా చంద్రబాబు, భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు వికసిత్ భారత్-2047 కోసం నిర్విరామంగా శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో సాధించవలసిన ప్రగతి, అందుకు సంబంధించి ఇప్పటి నుంచే రూపొందించాల్సినా కార్యచరణపై ఈ ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ కోసం సీఎం చంద్రబాబు ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సిందూర్ ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ హయాంలో ఇటు దేశంలో, అటు ఏపీలో సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. ఏపీలో 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తన ప్రజెంటేషన్ లో వివరించారు.

వికసిత్ భారత్-2047 కల సాకారమయ్యేలాగా స్వర్ణాంధ్ర వికసించేలాగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం, వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో వివరించారు. విశాఖకు అంతర్జాతీయ హంగులు దిద్దుతున్నామని, నాలుగు జోన్ లుగా విభజించాలన్న యోచనలో ఉన్నామని తెలిపారు. అమరావతి, కర్నూలు, తిరుపతిలు కూడా విశాఖ మోడల్ ను పరిశీలిస్తున్నామని అన్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రజెంటేషన్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ప్రజెంటేషన్ లో విషయాలు వికసిత్ భారత్-2047 లక సాకారమయ్యేందుకు దోహదం చేసేలా ఉన్నాయని కితాబిచ్చారు. అంతేకాదు, మిగతా రాష్ట్రాలు కూడా చంద్రబాబు చెప్పిన ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు.