తొందరలోనే వేల కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రూ. 20 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్, అపాచీ కంపెనీలు తమ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇవే కాకుండా పర్యావరణ రహిత, ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీలు సిద్దంగా ఉన్నట్లు కూడా మంత్రి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుపై తైవాన్ చాలా ఆసక్తిగా ఉందట.
ఇక అదాని అయితే రూ. 15 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే సెంటర్ లో సుమారు 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అదాని, అపాచి లాంటి కంపెనీల ద్వారా తొందరలోనే 40 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఏదేమైనా రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి మెల్లిగా అయినా పెట్టుబడులు పెట్టటానికి స్వదేశీ, విదేశీ పరిశ్రమలు రావటం శుభపరిణామమనే చెప్పాలి.
వైజాగ్-నెల్లూరు మద్యలో ఉన్న సముద్ర తీరం ఆధారంగా చేసుకుని షిప్పింగ్ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీలు, సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే పరిశ్రమలు రాబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆసక్తి చూపుతున్న పరిశ్రమలను ఒకేచోట కాకుండా వాటి సామర్ధ్యం, అవసరం, అవకాశాలను బట్టి రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లోకి తీసుకెళితే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. లేకపోతే రాష్ట్ర విభజన సమయంలో ఏపి ఎదుర్కొన్న సమస్యలనే మిగిలిన ప్రాంతాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates