‘వెండితెర వేదికగా’ క్యాప్షన్‌తో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించిన మన వూరు.. మాటా మంతి కార్యక్రమం సక్సెస్ అయింది. ఈ కార్యక్రమం ద్వారా రెండు లక్ష్యాలను నెరవేర్చు కోవాలన్నది పవన్ కల్యాణ్ ప్రధాన ఉద్దేశం. 1) గ్రామీణుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలను బలంగా ప్రజల్లోకి పంపించడం. 2) గ్రామీణులకు చేరువకావడం ద్వారా.. తన ఉనికిని పదిలం చేసుకోవడం.
ప్రస్తుతం గ్రామీణుల ఓటు బ్యాంకు.. బలంగా ఉంది. ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆ ఓటు బ్యాంకును బదాబదలు చేసి.. తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది జనసేన ఉద్దేశం. ఈ క్రమంలోనే తరచుగా గ్రామీణ సమస్యలపైనా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనా పవన్ కల్యాణ్ ఫోకస్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే వారితో నేరు మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకుని.. తద్వారా.. వారిని తనవైపు తిప్పుకోవాలన్నది కీలక ప్రయత్నం.
ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు గ్రామీణ స్థాయిలో సుమారు 42 శాతం వరకు ఓటు బ్యాంకు ఉంది. ఇది నిర్దిష్టంగా పడే ఓటు బ్యాంకు. నగరాలతో పోల్చుకుంటే.. గ్రామీణ స్థాయిలో ఓటుబ్యాంకు పదిలంగా ఉం టుంది. ఖచ్చితంగా ఓటు వేసేవారే. అయితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కూడా.. గ్రామీణులు.. ఆ కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌కు ఆ ఓటు బ్యాంకు అనుకూలంగా మారిందనే వాదన ఉంది.
గత ఏడాది కూటమి ప్రభంజనంలోనూ.. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు దక్కడం వెనుక గ్రామీణులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు దీనిని తమవైపు తిప్పుకోవడం ద్వారా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ఓటు బ్యాంకును చిన్నాభిన్నం చేయాలన్నది అంతర్గత రాజకీయ లక్ష్యం. ఈ క్రమంలోనే మాటా మంతీపేరుతో గ్రామీణులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇది తాజాగా సక్సెస్ కావడంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.