కేసులతో 4 పెళ్లిళ్లు ప్రమాదంలో పడ్డాయా?

ఏపీలో కూటమి సర్కారు వరుసబెట్టి కేసులు నమోదు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఈ కేసుల్లో ఇప్పటికే చాలా మంది నేతలు, అధికారులు, అనధికారులు అరెస్టు కాగా… వారిలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు. అరెస్టుల వరకు ఓకే గానీ.. ఈ అరెస్టుల కారణంగా ఆయా నిందితుల ఇళ్లల్లో శుభకార్యాలు నిలిచిపోయే ప్రమాదం వచ్చి పడిందట. ఈ విషయాన్ని ఏ దారిన పోయే దానయ్యో చెప్పలేదు. సాక్షాత్తు వైసీపీ పాలనను నడిపించిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ఈ విషయాన్ని చెప్పారు.

అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్న జగన్… లిక్కర్ స్కాం కీలక మలుపు తీసుకుంటుందని భావిస్తున్న తీరుణంలో గురువారం మరోమారు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కూటమి సర్కారుపై తనదైన శైలి ఆరోపణలు గుప్పించారు. తన పాలనలో జరిగినదంతా సక్రమంగానే జరిగిందంటూ ప్రొజెక్ట్ చేసుకునే యత్నం చేశారు. ఇందుకోసం ఆయన పలు ప్రభుత్వ గణాంకాలనే ఆధారంగా తీసుకుని సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన నలుగురు కీలక వ్యక్తుల ఇళ్లల్లోని ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ సీఎంగా ఉండగా సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఇలాంటి కీలక సమయంలో మద్యం కుంభకోణంలో ఆయనను అరెస్టు చేశారని జగన్ ఆరోపించారు. ఇక ఇదే కేసులో దనుంజయ్ రెడ్డితో పాటే అరెస్టు అయిన జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమార్తెకు ఇటీవలే పెళ్లి కుదిరిందట. ఇలాంటి కీలక తరుణంలో కృష్ణమోహన్ రెడ్డికి అరెస్టు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక మద్యం కుంభకోణంలోనే భారతి సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గా కొనసాగుతున్న బాలాజీ గోవిందప్ప కూడా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. బాలాజీ గోవిందప్పకు బారతీ సిమెంట్స్ తో సంబంధమే లేదని చెప్పిన జగన్… గోవిందప్ప కూడా తన రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని యత్నిస్తుండగానే అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముంబై నటి జెత్వానీ కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అదికారి పీఎస్ఆర్ ఆంజనేయులు రెండో కుమారుడికి కూడా ఇటీవలే పెళ్లి ఖాయమైందట. అయితే పీఎస్ఆర్ అరెస్టుతో అమ్మాయి తరఫు వారు అపోహలకు గురి కాకుండా పీఎస్ఆర్ సతీమణి రంగంలోకి దిగి చర్చలు జరపాల్సి వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు.