ప్రజల కోసం..ప్రజల చేత ఎన్నుకోబడిన వారే ప్రజా ప్రతినిధులు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తానని అందరు ప్రజాప్రతినిధులు ఎన్నిలకు ముందు హామీనిస్తారు. కానీ, ఆ హామీని నిలబెట్టుకునే ప్రజా ప్రతినిధులకు కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మందిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరు. ప్రజలతో మమేకమయ్యేందుకు తన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి కారణాలు అడ్డు వస్తుండడంతో పవన్ ‘మన ఊరు-మాటా మంతి’ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని రావి వలస ప్రజలతో అక్కడి థియేటర్ లో వర్చువల్ గా పవన్ సమావేశమైన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పవన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడికి జనసైనికులతో పాటు పవన్ అభిమానులు కూడా వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో, ఆ కార్యక్రమం సందర్భంగా పవన్ కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రజా కార్యక్రమాలు వేరు, సినిమా ఈవెంట్లు వేరు అని చెప్పినా…ఫ్యాన్స్ మాత్రం తమ అభిమానాన్ని చాటుకుంటూ పవన్ ను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు పవన్ కు ఇబ్బంది అవుతోంది. ఈ క్రమంలోనే థియేటర్లలలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించాలన్న ఆలోచనకు పవన్ శ్రీకారం చుట్టారు.
మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రావివలసలోని గ్రామస్థులతో పవన్ వర్చువల్ గా భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు కార్యక్రమాల గురించి ప్రజలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకున్న పవన్..వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పవన్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. పవన్ ను మరింతమంది నేతలు ఫాలో అయ్యే చాన్స్ ఉంది.
దీంతో, పవన్ ఫ్యాన్స్, జనసైనికులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. నేను ట్రెండ్ ఫాలో కాను..ట్రెండ్ సెట్ చేస్తా అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్ ను ఈ కార్యక్రమానికి సింక్ చేస్తున్నారు. సినీ రంగానికి చెందని పవన్ తన మార్క్ ను చూపించారని, ఇలా థియేటర్లను ప్రజా కార్యక్రమానికి వాడారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.