ఇలా వంగి వంగి దండాలెందుకు సారూ

బీఆర్ఎస్ హయాంలో హెల్త్ డైరెక్టర్ గా కొనసాగిన శ్రీనివాస్ అయినా… నేడు కాంగ్రెస్ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న శరత్ అయినా నిజంగానే ఆలిండియా సర్వీసు అదికారుల పరువు తీసేశారు. అంతేనా తమ సహోద్యోగులతో పాటుగా తమ కింది స్థాయి ఉద్యోగుల మనోభావాలను కూడా వారు అవమాన పరిచినట్టే లెక్క. ఎందుకంటే… ప్రభుత్వ పాలనలో కీలక స్థానంలో ఉన్న శ్రీనివాస్ నాటి సీఎం కేసీఆర్ కాళ్లను పదే పదే మొక్కితే… నేడు సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు శరత్ బహిరంగ వేదిక మీదే వందనం చేశారు.

ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద గిరిజన రైతులకు చెందిన 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్య హక్కులు కల్పించే ఇందిర సౌర గిరి జల వికాసం పధకానికి శ్రీకారం చుట్టారు. నల్లమల డిక్లరేషన్ పేరిట ఈ కార్యక్రమాన్ని రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదిక మీద గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి శరత్… సీఎం రేవంత్ వద్దకు వచ్చి ఆయన చేతిలో ఓ జ్ఞాపికను పెట్టారు. అనంతరం సీఎం రేవంత్ కాళ్లకు ఆయన నమస్కారం చేశారు.

ఈ దృశ్యాలు కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వగా… వైరల్ అయ్యాయి. తెలంగాణలో ఇదేం సంస్కృతి… రాజకీయ నేతల కాళ్లపై పడి ఐఏఎస్ స్థాయి అదికారులు ఇలా సాగిలపడటమేమిటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఏకంగా సివిల్ సర్వెంట్లకు విధి విధానాలు అంటూ ఏకంగా ఓ సర్క్యూలర్ నే జారీ చేయాల్సి వచ్చింది. సివిల్ సర్వీసెస్ అధికారులు వారి డిగ్నిటీకి తగిన రీతిలో వ్యవహరించాలని, బహిరంగ వేదికలపై వారి గౌరవానికి సరిపడిన రీతిలో వ్యవహరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదిలా ఉంటే… గతంలో హెల్త్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్… కరోనా సమయంలో యమా ఫేమస్ అయ్యారు. ఈ ఫేమ్ ఆయనకు రాజకీయాలపై మక్కువను పెంచేసింది. ఇంకేముంది?…అప్పటికే సుదీర్ఘకాలంగా హెల్త్ సెక్రటరీగా సాగుతున్న శ్రీనివాస్ కు కేసీఆర్ తో మంచి ర్యాపోనే ఉంది. ఈ ర్యాపో ఎలాగైనా పనికొస్తుందన్న భావనతో ఆయన ఏకంగా తన జిల్లా పరిదిలోని తన సొంత నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ టికెట్ ను ఆశించారు. ఈ విషయాన్ని కేసీఆర్ చెవిలే వేసేందుకు నానా తంటాలు పడ్డ శ్రీనివాస్… పలుమార్లు కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఈ ఫొటోలు, వీడియోలు నాడు తెగ వైరల్ అయ్యాయి. అయితే శ్రీనివాస్ కల మాత్రం నెరవేరలేదు.