వైసీపీ నాయకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్.. రౌడీ షీటర్.. బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి జైలు-బెయిలు అన్నట్టుగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత.. ఆయనకు సోషల్ మీడియా కేసుల్లో సోమవారం బెయిల్ లభించింది. హైకోర్టు పలు షరతులతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనిత తదితర నాయకులపై అనిల్ నోరు పారేసుకున్నారు. తీవ్ర దుర్భాషలతో చెలరేగిపోయారు. దీంతో కూటమి సర్కారు వచ్చాక ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను కోర్టుకు హాజరు పరిచి జైలుకు తరలించారు.
మధ్యలో మధ్యంతర బెయిల్ వచ్చినా.. నకిలీ సర్టిఫెకెట్లు(అమ్మకు ఆరోగ్యం బాగోలేదని) సమర్పించి కోర్టును తప్పుదోవపట్టించారన్న కారణంగా.. మరో కేసు నమోదైంది. ఇక, ఆయా కేసుల్లో బోరుగడ్డకు అత్యంత కష్టం మీద బెయిల్ దక్కింది. కానీ, ఆయన ఇంకా జైలు నుంచి బయటకు రాలేదు. ఫార్మాలిటీస్ పూర్తి కాలేదని.. అందుకే విడుదల చేయలేదని మంగళవారం అనంతపురం జైలు అధికారులు వెల్లడించారు. మరోవైపు బోరుగడ్డలో టెన్షన్ టెన్షన్.. బెయిల్ వచ్చినా బయటకు వస్తానా? అనే అనుమానం ముసురుకుంది. ఈ అనుమానమే నిజమైంది. ప్రస్తుతం అనంతపురం జైల్లో ఉన్న బోరుగడ్డను గుంటూరు పోలీసులు అరెస్టు చేసి మరో కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఏంటీ తాజా కేసు?
2015-16 మధ్య పెదకాకానిలోని తన స్థలానికి సర్వే చేసినట్టుగా సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారి మల్లికార్జున్‌పై బోరుగడ్డ ఒత్తిడి చేశారు. అయితే.. నిబంధనల ప్రకారమే తాను వ్యవహరిస్తానని మల్లికార్జున్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను ఓ రాత్రి బెదిరింపులకు గురి చేశారు. దీనిపై అప్పట్లోనే మల్లికార్జున్ ఫిర్యాదు చేయడంతో కాకాని పోలీసులు కేసు పెట్టారు. ఆ తర్వాత.. ఈ కేసు ఏమైందో ఏమో తెలియదు కానీ.. అనిల్ మాత్రం బాగానే బయట తిరిగాడు. ఇక, తాజాగా ఈ కేసును తిరగదోడిన కాకాని పోలీసులు.. మంగళవారం పీటీ వారెంట్‌పై జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.