భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు ఇరువురికీ ఉభయ తారకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. పరస్పర సహకారంతో రెండు పార్టీలు బలపడతాయని.. జగన్ సర్కారును దీటుగా ఎదుర్కొంటాయని భావించారు. కానీ బీజేపీకి సహకరించే విషయంలో పవన్ ఎంతో సిన్సియర్‌గా కనిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ నుంచి పవన్‌కు, జనసేనకు ఏమాత్రం సహకారం అందుతోందన్నది ముందు నుంచి సందేహంగానే ఉంది.
పవన్ చేసే పోరాటాలకు భాజపా రాష్ట్ర స్థాయి నుంచి కానీ, కేంద్ర స్థాయి నుంచి కానీ పెద్దగా మద్దతు లభిస్తున్నట్లయితే లేదు. జనసేనను ఎండోర్స్ చేసే ప్రయత్నం భాజపా నాయకులు ఎక్కడా చేయట్లేదు. కానీ పవన్ మాత్రం భాజపాకు ఎలివేషన్లు ఇస్తూనే ఉన్నారు. వాళ్ల నిర్ణయాల్ని, విధానాల్ని ఎలివేట్ చేస్తున్నాడు. ప్రచారం చేస్తున్నారు. కొన్నిసార్లు తన సహజ శైలిని వీడి కాషాయం పులిమేసుకుంటున్నాడన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.
ఒకసారి పవన్ ట్విట్టర్ టైమ్ లైన్ చూస్తే అందులో అక్కడక్కడా కాషాయపు టచ్ కనిపిస్తూనే ఉంది. పవన్ పిన్డ్ ట్వీట్ సంగతే చూస్తే ఆయన పరశురాముడి జయంతిని పురస్కరించుకుని పెట్టిన మెసేజ్ కనిపిస్తుంది. కొన్ని రోజుల కిందట శంకరాచార్యుల జయంతి ట్వీట్ కూడా ఉంది.
పరశురాముడు, శంకరాచార్యులు గొప్పవాళ్లే కావచ్చు. వాళ్ల జయంతిని గుర్తు చేసి జనాలకు సందేశం ఇవ్వడం మంచిదే కావచ్చు. కానీ గత ఏడాది కానీ.. అంతకుముందు కానీ పవన్ ఈ పని చేశాడా అన్నది చూడాలి. జనాలు పవన్ ఏం మెసేజ్ ఇచ్చాడని కాకుండా.. ఇప్పుడే ఎందుకు ఈ మెసేజ్‌లు పెడుతున్నాడని చూస్తున్నాడు. వీళ్లిద్దరూ హిందూ పురాణ పురుషులు కావడంతో ఈ ట్వీట్లను ‘కాషాయ’ కోణంలోనే చూస్తున్నారు.
ఇక మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రకటన చేసినా దాన్ని పవన్ ఎండోర్స్ చేస్తున్న విధానం మీదా చర్చ నడుస్తోంది. ఇదంతా ఒకెత్తయితే.. మొన్న ఇండియాలో లిబరల్స్ తీరు ఎలా ఉంటుందో చెప్పే ఒక వ్యాసాన్ని పవన్ షేర్ చేసి జనసైనికులు చదవాలని మెసేజ్ ఇచ్చాడు.
ఈ లిబరల్స్‌కు, భాజపాకు ఉన్న శతృత్వం దృష్ట్యా పవన్ ఈ కథనాన్ని చదవాలని జనసైనికులకు పిలుపునివ్వడంలోనూ ట్విట్టర్ జనాలు మరో కోణాన్ని చూస్తున్నారు. పవన్ భాజపాను మరీ ఇంతలా నెత్తికెత్తుకోవాలా.. వ్యక్తిత్వాన్ని కోల్పోవాలా.. ప్రతిగా వాళ్లు ఈయనకు ఏం చేస్తున్నారు.. అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనికి పవన్ సమాధానమేంటో?
Gulte Telugu Telugu Political and Movie News Updates