“ఏంటబ్బా ఈ కేసులు.. ఒకదాని తర్వాత.. ఒకటా.? కనీసం బెయిల్ కూడా దక్కకుండా చేస్తున్నారే. ఇవన్నీ చూస్తుంటే.. నాకు మైండ్ బ్లాంక్ అవుతోంది. అయినా.. ధైర్యంగానే ఉందాం. ప్రజలే అన్నీ చూసుకుంటారు. బాబు పాపాలు పండినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారు. మీరు ఎక్కడా నిరుత్సాహ పడకండి. నాలాగే ధైర్యంగా ఉండండి` అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సహజంగా జగన్ నుంచి నోటీ నుంచిమైండ్ బ్లాంక్` అనే మాట వస్తుందని ఎవరూ ఊహించరు. అనేక సమస్యలు వచ్చినా.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందన్నా.. నిమ్మకు నీరెత్తినట్టునిదానంగా వ్యవహరించడం .. ఆయన పేటెంట్ అని పార్టీ నాయకులే చెబుతారు.
అలాంటిది తాజాగా జగన్.. తన మైండ్ బ్లాంక్ అవుతోందంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సహా .. మద్యం కేసులో వరుస పెట్టి జరిగిన అరెస్టులు, జైళ్లకు పంపడాలతో జగన్ ఒకింత షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఎవరూ ఊహించనివిధంగా కామెంట్లు చేశారని తెలుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా.. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) కార్పొరేటర్లు, వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా జగన్ తొలుత పైవిధంగా వ్యాఖ్యానించారు. అనంతరం.. ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని టీడీపీ హయాంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. తమ హయాంలో ట్రైబల్ ప్రాంతాలను అభివృద్ధి చేశామని అన్నారు. టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ లో భూసేకరణ జరగలేదన్నారు. వైస్సార్సీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరగిందన్నారు. రాష్టంలోని అన్ని వ్యవస్థ లను చంద్రబాబు నిర్వీర్యం చేసారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. అయినా.. ధైర్యం కోల్పోకుండా.. పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.