ఏపీలోని కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకుల డోర్ డెలివరీని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కూడా ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేసింది. అంటే.. వైసీపీ పాలనలో ప్రారంభమైన రేషన్ సరుకుల డోర్ డెలివరీని కూటమి సర్కారు జూన్ 1 నుంచి రద్దు చేస్తుందన్న మాట. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
రేషన్ సరుకుల డోర్ డెలివరీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం… వృద్ధులు, దివ్యాంగుల విషయంలో మాత్రం ఈ నిర్ణయాన్ని మినహాయించింది. ఇతరత్రా వర్గాలు జూన్ 1 నుంచి రేషన్ షాపులకు వెళ్లి రేషన్ సరుకులు తీసుకుని వెళ్లాల్సి ఉన్నా… వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఆయా రేషన్ షాపులు రేషన్ సరుకులను డోర్ డెలివరీ పద్దతిననే అందజేయనున్నాయి. ఫలితంగా వారికి ఈ నిర్ణయం నుంచి ప్రభావం పడదని చెప్పక తప్పదు.
ఏపీలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా 2019 దాకా రేషన్ సరుకులు రేషన్ షాపుల నుంచే అందేవి. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చాక రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందించాలని జగన్ నిర్ణయించారు. అందుకోసం వేల కొద్ది ఎండీయూ వాహనాలను కూడా కొనుగోలు చేశారు. ఇందుకోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించారు. రేషన్ సరుకుల డోర్ డెలివరీని ప్రారంభించారు. ఇందులో పలు లోటుపాట్లు కనిపించాయి. వాహనదారులకు ఈ పద్ధతి పెను భారంగా పరిణమించిందన్న వాదనలు వినిపించాయి.
ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి… వైసీపీని చిత్తుగా ఓడించింది. ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కూటమి సర్కారు… జగన్ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను ఒక్కటొక్కటిగానే రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే జగన్ అమలు చేసిన పలు కీలక సంస్కరణలకు చెల్లుచీటి పలికిన కూటమి… తాజాగా రేషన్ డోర్ డెలివరీని కూడా రద్దు చేసింది. దీంతో రేషన్ సరుకుల డోర్ డెలివరీ కోసం కొనుగోలు చేసిన వాహనాలను కూటమి సర్కారు ఎలా వినియోగిస్తుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.