ఏపీలోని కూటమి సర్కారు సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అదికారంలో ఉండగా… 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో అనుమాస్పద స్థితిలో 22 మంది దాకా చనిపోయారు. ఈ మరణాలకు కల్తీ కల్లే కారణమని నాడు ఆరోపణలు వినిపించినా… ఆ దిశగా నాడు దర్యాప్తు జరిగిన దాఖలా లేదు అయితే బాధితుల కుటుంబాలు ఈ మరణాలపై తమకు అనుమానాలున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను ఆశ్రయించాయి. ఇలా జంగారెడ్డిగూడెం పీఎస్ లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. వీటిపై దర్యాప్తు జరిగిన దాఖలానే కనిపించలేదు. ఇప్పుడు కూటమి సర్కారు ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తునకు ఏకంగా ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ నేతృత్వంలో పనిచేయనున్న ఈ టాస్క్ ఫోర్స్ లో ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వేణు ప్రభు కుమార్, రంగరాయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అదిపతి ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. నాడు జంగారెడ్డిగూడెంలో జరిగిన ఈ మరణాలపై నాటి ప్రభుత్వం గానీ, జిల్లా అధికార యంత్రాంగం గానీ అంతగా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలోని చింతలపూడి అసెంబ్లీ కిందకు జంగారెడ్డిగూడెం వస్తుంది. నాడు వైసీపీ అదికారంలో ఉండగా… చింతలపూడి ఎమ్మెల్యేగా కూడా వైసీపీ నేత ఎలీజా కొనసాగారు. కారణం ఏమిటో తెలియదు గానీ… ఈ ఘటనపై మాత్రం ఆశించిన మేర దర్యాప్తు అయితే జరగలేదు.
తాజాగా పలు అంశాలపై సమీక్ష చేస్తున్న క్రమంలో జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మరణాలపైనా కూటమి సర్కారులో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే అసలు జంగారెడ్డిగూడెం మరణాలకు కారణాలేమిటన్న విషయాన్ని అయినా ఎందుకు తేల్చలేదన్న బావనతో కూటమి సర్కారు సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది సామాన్య ప్రజలు చనిపోతే… నాటి ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న దానిపై నాడే సర్వత్రా విస్మయం వ్యక్తం అయ్యింది. తాజాగా కూటమి సర్కారు వచ్చాక దీనిపై విచారణకు ఆదేశాలు రావడంతో వైసీపీకి ఈ దర్యాప్తుతో మరో గట్టి ఎదురు దెబ్బ తప్పదన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.