ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ – ఉర్ – రెహ్మాన్ అనే వ్యక్తిని ఉగ్రవాద సానుభూతిపరుడిగా గుర్తించిన రెండు తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు.. తాజాగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఉగ్ర కదలికలు, ఉగ్రవాద సానుభూతి పరుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడిగి వివరాలు తెలుసుకున్న కేంద్ర హోం శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కూడా ఈ వ్యవహారంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖ సంధించారు.
“రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు.. ఉగ్ర సానుభూతి పరులు ఉన్నారా? ఇది చాలా ప్రమాదకర విషయం. తెలంగాణ, ఏపీ పోలీసు నిఘా వర్గాలు గుర్తించిన విషయం నా దృష్టికి వచ్చింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఇలాంటి వాటిపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి. అసలు ఏం జరిగిందో ప్రభుత్వానికి నివేదించండి“ అని పవన్ కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. విజయనగరం అదేసమయంలో హైదరాబాద్‌లో అరెస్టయిన ఉగ్రవాద సానుభూతి పరుల వ్యవహారాన్ని కూడా ఆరా తీయాలని, మరింత లోతుగా విశ్లేషించాలని పవన్ కల్యాణ్ కోరారు. దేశం సహా, రాష్ట్రప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఏఎస్సై కొడుకే.. ఉగ్ర సానుభూతి పరుడు!
విజయనగరానికి చెందిన సిరాజ్-ఉర్-రెహ్మాన్‌కు దుబాయ్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తో సంబంధాలు ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు.. ఐఎస్ ఆదేశాల మేరకు.. యూట్యూబ్ లో చూసి టిఫిన్ బాంబులను కూడా తయారు చేశాడు. ఇతనికి హైదరాబాద్‌లోని వారాసి గూడకు చెందిన మరో వ్యక్తి సాయం చేశాడు. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది. ప్రస్తుతం వీరిద్దరినీ అధికారులు విచారిస్తున్నారు. ఎన్నాళ్ల నుంచి ఉగ్ర సంబంధాలు ఉన్నాయనే కోణంలో సమాచారం రాబడుతున్నారు.
ఇదిలావుంటే.. సిరాజ్ – ఉర్ – రెహ్మాన్ తండ్రి విజయనగరంలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నాడు. ఆయన సోదరుడు కూడా అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్నాడు. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్‌గా మారింది. ఏఎస్సై కొడుకే ఉగ్రవాద సానుభూతి పరుడిగా ఉండడం హోంశాఖలో కలకలం రేపింది. అయితే.. ఈ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. సదరు ఏఎస్సై పేరు, ఊరు, చిరునామా వివరాలను వెల్లడించడం లేదు. మరోవైపు.. అతనిని సుదీర్ఘ సెలవుపై పంపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా సిరాస్ సోదరుడిని కూడా సెలవుపై పంపినట్టు సమాచారం.