‘నీళ్లు లేని ఫైరింజ‌న్లు.. ఆక్సిజ‌న్‌లేని అంబులెన్సులు’

హైద‌రాబాద్‌లోని చార్మినార్ స‌మీపంలో ఉన్న‌ గుల్జార్ హౌస్‌లో ఆదివారం జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మాదం లో ఒకే కుటుంబంలోని 17 మంది మృతి చెంద‌గా.. మ‌రింత మంది గాయ‌ప‌డ్డారు. అదేవిధంగా ప‌లువ‌రు మృతి చెందారు. ఈ ఘ‌ట‌నా ప్రాంతాన్ని తాజాగా తెలంగాణ మాజీ మంత్ర కేటీఆర్ ప‌రిశీలించారు. రాష్ట్రం లో గ‌త ప‌దేళ్ల‌లో జ‌రిగిన అతి పెద్ద అగ్ని ప్ర‌మాదం ఇదేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌తో అయినా.. ప్ర‌భుత్వం మేల్కోవాల‌ని సూచించారు.

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం.. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే.. ప్ర‌భుత్వం స్పందించిన తీరు ఏమాత్రం బాగోలేద‌న్నారు. తాను ఏం మాట్లాడినా రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని విమ‌ర్శ‌లు చేస్తార‌ని.. కానీ, జ‌రిగిన ఘ‌ట‌న‌.. ప్ర‌భుత్వ స్పంద‌న‌ను పోల్చి చూస్తే.. ఖ‌చ్చితంగా ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని కాపాడ‌డంలో స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. అగ్ని ప్ర‌మాదాన్ని నివారించేందుకు పంపించిన ఫైర్ ఇంజ‌న్ల‌లో నీళ్లు లేవ‌ని కేటీఆర్ చెప్పారు. ఇక‌, బాధితుల‌ను ఆదుకునేందుకు వ‌చ్చిన అంబులెన్సుల్లో ఆక్సిజ‌న్ మాస్కులు, సిలిండ‌ర్లు కూడా లేవ‌న్నారు. వీటి వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం అని ప్ర‌శ్నించారు. జ‌రిగిన ఘ‌ట‌నలో అనేక మంది ప్రాణాలు కోల్పోయార‌ని.. వారికి స‌కాలంలో వైద్యం అంది ఉంటే బ్ర‌తికి ఉండేవార‌ని చెప్పారు.

కానీ, ప్ర‌భుత్వం కూడా అచేత‌నంగా వ్య‌వ‌హ‌రించింద‌ని విమ‌ర్శించారు. అందుకే.. ఇంత మంది చ‌నిపో యార‌న్నారు. తాను రాజ‌కీయాలు చేయ‌డానికి రాలేద‌ని.. బాధితుల‌ను, వారి కుటుంబాల‌ను ఓదార్చేందు కు వ‌చ్చాన‌ని కేటీఆర్ మీడియాకు చెప్పారు. త‌మ హ‌యాంలో ఇలాంటి అగ్ని ప్ర‌మాదాలు ఎప్పుడూ చోటు చేసుకోలేద‌న్నారు.