ఊపిరి వచ్చే వేళ.. ఈ ఉపద్రవాలేంటో?

ఆంధ్రుల హక్కు… విశాఖ ఉక్కు అన్న నినాదాన్ని కూటమి సర్కారు సజీవంగా నిలిపింది. అప్పటిదాకా మార్కెట్లో అంగడి సరుకులా నిలిచిన విశాఖ ఉక్కును పరిరక్షించుందామని హామీ ఇచ్చిన కూటమి సర్కారు…అదికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీని అమలు చేసి తన మాటను నిలబెట్టుకుంది. విశాఖ ఉక్కును అమ్మేద్దామని ప్రణాళికలు రచించి వడివడిగా సాగిన కేంద్ర ప్రభుత్వం చేత అదే విశాఖ ఉక్కుకు ఊపిరి ఊదే బాధ్యతను భుజానికెత్తింది. ఇదంతా బాగానే ఉన్నా. ఇలా విశాఖ ఉక్కుకు ఊపిరి వచ్చే వేళ… ఫ్యాక్టరీలో ఆదివారం ఓ భారీ ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశమే అయినా… కేంద్రం ఊపిరి ఊదుతున్న ఇలాంటి తరుణంలో దాదాపుగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైన అంశం మాత్రం అందరినీ షాక్ కు గురి చేసిందని చెప్పాలి. అంతేకాకుండా ఒక్కసారి లైనింగ్ వేస్తే… 1,050 హీట్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయాల్సిన టర్బో ల్యాడిల్ కార్ (టీఎల్సీ) కేవలం 500 హీట్లకే రంద్రం పడిపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. అంటే టీఎల్సీకి లైనింగ్ పనులను ఏదో అలా చేశారు తప్పించి… అందులో లేశమాత్రం కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న మాట.

ఇక ఆదివారం జరిగిన ప్రమాదం గురించిన వివరాల్లోకి వెళితే… బ్లాస్ట్ ఫర్నేస్ 2లో ఫర్నేస్ నుంచి ద్రవ ఉక్కును టీఎల్సీ లోకి నింపే కార్యక్రమం పూర్తి అయ్యింది. మరికాసేపు ఉంటే… ఆ ద్రవ ఉక్కు టీఎల్సీ ద్వారా ఎస్ఎంఎస్ కు తరలి వెళ్లేదే. అదే జరిగి ఉంటే… ఎలాంటి ప్రమాదం లేదు. టీఎల్సీ అక్కడి నుంచి కదలకముందే… దాని అడుగు భాగాన రంద్రం పడిపోయింది. టీఎల్సీలో ఉన్న ద్రవ ఉక్కు అంతా నేలపాలైంది. ద్రవ ఉక్కు పడటంతో కేబుల్స్, టీఎల్సీ రవాణా కోసం ఏర్పాటు చేసిన ట్రాక్ కాలిపోయాయి. ఈ సందర్బంగా అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగ అలముకున్నాయి.. అయితే కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పింది.