వైసీపీ కీలక నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఆదివారం మరోమారు అరెస్టు అయ్యారు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు అయి…రోజుల తరబడి జైల్లో ఉండి… ఎలాగోలా బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన ఆయనను తుళ్లూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో మరి ఆయనకు రిమాండ్ పడుతుందో… లేదంటే అక్కడికక్కడే బెయిల్ లభిస్తుందో చూడాలి. ఒకవేళ రిమాండ్ ఖరారైతే మాత్రం నందిగంకు మళ్లీ కష్టాలు మొదలైనట్టేనని చెప్పక తప్పదు.
అయినా ఈ సారి ఏ కేసులో నందిగం సురేశ్ అరెస్టు అయ్యారన్న విషయానికి వస్తే… ఇదో పెట్టీ కేసుగానే చెప్పాలి. అయితే ఓ మాజీ ఎంపీ అయి ఉండి… ఓ చిన్న గొడవలో తలదూర్చి అవతలి వ్యక్తిపై తన మనుషులు చెప్పిన మాటలు విని దాడి చేయడం తప్పు కదా. ఇవేవీ పట్టించుకోని సురేశ్ అదే పని చేశారట. రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం సురేశ్ సొంతూరు కదా. ఆ ఇల్లు ఉన్న వీధిలో నిన్న రాత్రి టీడీపీకి చెందిన ఇసుకపల్లి రాజు అనే కార్యకర్త తన కారుతో వేగంగా వెళ్లారట.
అంతే… రాజు కారును నిలివేసిన సురేశ్ అనుచరులు ఆయనపై దాడికి దిగారట. అంతటితో ఆగకుండా రాజును సురేశ్ వద్దకు ఈడ్చుకెళ్లారట. తన అనుచరులు ఏం చెప్పారో తెలయిదు గానీ.. రాజుపై ఉగిపోయిన సురేశ్, ఆయన సోదరుడు ప్రభుదాస్ లు దాడికి పాల్పడ్డారట. ఈ దాడిలో రాజుకు గాయాలు కాగా…ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని ఆయన ఇల్లు చేరగా… కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం రాజు సతీమణి నేరుగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సురేశ్ ను అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే… తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద రాజు సతీమణిని చూసినంతనే సురేశ్ తో పాటు ఆయన సతీమణి బేబీలత ఆమెపై విరుచుకుపడ్డారు. తమపై తప్పుడు కేసులు పెడతారా? అంటూ పోలీసుల ఎదుటే వాదులాటకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో సరిపోయింది గానీ… లేదంటే… రాజు సతీమణిపైనా వారు దాడి చేసే వారన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన వీరి వాదులాట వీడియోలు వైరల్ గా మారాయి.