=

బీజేపీతో దోస్తానాలో జగన్ ది ముమ్మాటికీ తప్పే!

2024 సార్వత్రిక ఎన్నికలు జరిగి అప్పుడే ఏడాది కావస్తోంది. అప్పటిదాకా 175 సీట్లలో 151 సీట్లతో బలంగా ఉన్న వైసీపీ… కూటమి కొట్టిన దెబ్బకు ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. సరే… ఇదంతా తెలిసిన భాగోతమే గానీ… ఈ భాగోతంలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు చేశారని ఇప్పుడు ఆయన పార్టీకే చెందిన ఓ కీలక నేత సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. బీజేపీతో దోస్తానా విషయంలో జగన్ చేసింది ముమ్మాటికీ తప్పేనని కూడా ఆ నేత కుండబద్దలు కొట్టారు. ఆ నేతాశ్రీ మరెవరో కాదు… నెల్లూరు జిల్లా కొవ్వూరుకు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

నల్లపురెడ్డి వైసీపీలోనే కాకుండా తెలుగు నేల రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత కిందే లెక్క. ఏ పార్టీలో ఉన్నా తన మనసులో ఉన్న మాటను ఏమాత్రం మోహమాటం లేకుండా చెప్పేసే లక్షణమున్న నల్లపురెడ్డి శనివారం పార్టీ సీనియర్ నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీతో వైసీపీ పొత్తుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటే… బీజేపీతో కలిసి వైసీపీ పొత్తు పెట్టుకోవాలని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని తాను జగన్ ను కలిసినప్పుడు ఆయనకు కూడా చెబుతానని కూడా రెడ్డి అన్నారు. బీజేపీతో వైసీపీ పొత్తులో తప్పేముందని కూడా ఆయన ప్రశ్నించడం గమనార్హం.

ఈ సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావించిన నల్లపురెడ్డి.. నాడు వైసీపీ దోస్తానా కోసం బీజేపీ ఎదురు చూసిందన్న వార్తలు ఉన్నాయన్నారు. అదే నిజమైతే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జగన్ తప్పు చేశారని ఆయన తేల్చి పారేశారు. అదికారంలో ఉన్న ఐదేళ్లు కేంద్రంలోని మోదీ సర్కారుకు అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలిచిన వైసీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే తప్పేముందని కూడా ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉండగా బీజేపీకి అండగా నిలిచిన పార్టీ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తప్పేముందని కూడా ఆయన నిలదీసినంత పని చేశారు.

ఈ సందర్బంగా టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విషయాన్నికూడా ప్రస్తావించిన నల్లపురెడ్డి.. చంద్రబాబు అంటే అటు ప్రదాని నరేంద్ర మోదీకి గానీ, ఇటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు గానీ ఇష్టమే లేదని ఆయన తెలిపారు. మోదీపై చంద్రబాబు లెక్కలేనన్ని సార్లు ఘాటు విమర్శలు గుప్పించారన్న ఆయ… అమిత్ షాపై ఏకంగా రాళ్లు, చెప్పులు వేయించారని ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీతో దోస్తానాకే మోదీ, షాలు ఆసక్తి చూపారని, వైసీపీ నుంచి ఆ దిశగా అడుగులు పడకపోవడంతోనే బీజేపీ… టీడీపీ, జనసేనలతో కలిసి పోటీ చేసిందని ఆయన సూత్రీకరించారు. మొత్తంగా ఈ దఫా బీజేపీతో పొత్తుకు అవకాశం వస్తే గనుక జగన్ ఓకే చెప్పి తీరాల్సిందేనని నల్లపురెడ్డి తన మనసులోని మాటను ఒకింత గట్టిగానే చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలపై జగన్ ఏమంటారో చూడాలి.