ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్-6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీంతో, ఈ పథకం అమలు ఎప్పుడు అంటూ మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ ఏపీ సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు.
ఆ పథకం గురించి ఆలోచిస్తున్నానని, అవసరమైతే ఆగస్టు 15న, స్వాతంత్ర్య దినోత్సవాన తప్పకుండా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో, ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే చాన్స్ ఉంది. అయితే, కచ్చితంగా ఆగస్టు 15 నుంచి మొదలుబెడతారా లేదా అన్న పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భంగా చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతపై ఫోకస్ చేయాలని, ఆఫీసుల్లో శుభ్రతపై ఉద్యోగులు దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 125 రైతు బజార్లు ఉన్నాయని, 175 నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.