లోకేష్‌ పెద్ద‌ల‌కు ప‌రిచ‌యం.. బాబు స్ట్రాట‌జీ

నారా లోకేష్‌.. ప్ర‌స్తుతం టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంత‌ర్గ‌తంగా చెప్పాలంటే.. టీడీపీలో ఆయ‌నే ఇప్పుడు నెంబ‌ర్ 1 అనే టాక్ న‌డుస్తోంది. ఇది మంచిదే భ‌విష్య‌త్తులో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేది ఆయ‌నే కాబ‌ట్టి..ఈ విష‌యంలో ఎలాంటి సందేహాల‌కు తావులేదు కాబ‌ట్టి ఆయ‌న ఇప్ప‌టి నుంచే నెంబ‌ర్ 1గా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. తెర‌చాటుగా అదే జ‌రుగుతోంద‌ని కూడా అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో నారా లోకేష్ కు అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించి భాష్యం ప్ర‌వీణ్ వంటివారికి టికెట్లు ద‌క్కాయ‌నే టాక్ అంద‌రికీ తెలిసిందే. అదేవిధంగా ఇటీవ‌ల ఇచ్చిన నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ నారా లోకేష్ చెప్పిన వారికి అగ్ర‌తాంబూలం ద‌క్కింది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో త‌న‌కు వైద్యం చేసిన డాక్ట‌ర్‌, తిరుప‌తికి చెందిన వ్య‌క్తికి కీల‌క పోస్టు ఇచ్చారు. అలానే మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న వారు కూడా ఉన్నారు. అయితే.. భ‌విష్య‌త్తు కోసం ఇప్పుడు మ‌రింత వేగంగా నారా లోకేష్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మయ్యాయి.

తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని నారా లోకేష్ క‌లుసుకోనున్నారు. అయితే.. ప్ర‌ధానే ఆయ‌న‌ను ర‌మ్మ‌ని చెప్పార‌ని కాబ‌ట్టి వెళ్తున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఔను. ఇది నిజ‌మే. అయితే.. ఇప్పుడు మ‌హా నాడుకు ముందు ఆయ‌న వెళ్తుండ‌డ‌మే చ‌ర్చ‌నీయాంశం అయింది. పార్టీలో నెంబ‌ర్ 2గా ఉన్న నారా లోకే ష్ కు త్వ‌ర‌లోనే పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌న్న చ‌ర్చ ఉన్న నేప‌థ్యంలో ప‌రిచ‌యాలు పెంచుకోవ‌డంతో పాటు.. చంద్ర‌బాబు జాతీయ‌స్థాయి రాజ‌కీయాల‌ను కూడా ఒంట‌బ‌ట్టించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు.

రాష్ట్రంలో పార్టీ ప‌రంగా నారా లోకేష్‌కు తిరుగులేదు. పార్టీలో కొంద‌రు సీనియ‌ర్లను త‌ప్పించి.. అది కూడా ఎన్టీఆర్ హ‌యాం నాటి కొంద‌రిని ప‌క్క‌న పెడితే.. మిగిలిన‌వారంతా నారా లోకేష్ చెప్పిన‌ట్టే వింటున్నారు. పార్టీపరంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను కూడా ఆయ‌న ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అటు ప‌ద‌వులు.. ఇటు వివాదాల‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా హ్యాండిల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జాతీయ స్థాయిలో నారా లోకేష్ పుంజుకునేలా తాజా ఘ‌ట్టం ఉంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

కొన్ని రోజుల కింద‌ట‌.. ఎవ‌రూ పిల‌వ‌కుండానే లోకేష్ కేంద్ర మంత్రుల‌తో భేటీ అయిన విష‌యం తెలిసిం దే.అప్ప‌ట్లో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రుల‌ను క‌లుసుకున్నారు. ఈ ప‌రంప‌ర‌లో ప్ర‌ధాని మోడీతో భేటీ ద్వారా పూర్తిస్థాయిలో జాతీయ రాజ‌కీయాల్లో నారా లోకేష్‌కు కీల‌క గుర్తింపు వ‌చ్చేలా .. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నార‌ని చెబుతున్నారు.